సిరా న్యూస్,విజయవాడ;
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రిస్క్ తీసుకొని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే సంకల్పంతో రాష్ట్ర విభజనకు పూనుకున్నారు. తెలంగాణ ఏర్పాటుతో కాంగ్రెస్ రాజకీయంగా ఎంతో నష్టపోయింది. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజల ఆగ్రహంతో ఏపీలో కాంగ్రెస్ పునాదులే కూలిపోయాయి. ప్రత్యేక రాష్ట్రం కలలను సాకారం చేసుకున్న తెలంగాణలో కూడా ఆ పార్టీ అధికారంలోకి రావడానికి తొమ్మిదిన్నరేళ్లు పట్టిందిదక్షిణాదిన కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో ఆ పార్టీకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పునర్వైభవంపై ఆశలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు ఏపీ జనాకర్షణ నేత దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ వై.ఎస్ షర్మిలకు అప్పగిస్తారనే ప్రచారంతో ఆ పార్టీ సానూభూతిపరులు ఆమెను ఒక ఆశాకిరణంలో చూస్తున్నారు.కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిందనే ఆక్రోశంతో ఏపీ ప్రజలు ఆ పార్టీని పాతాళానికి తొక్కేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 2.8 శాతం, పార్లమెంట్ ఎన్నికల్లో 2.86 శాతం, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 1.17 శాతం, పార్లమెంట్ ఎన్నికల్లో 1.31 శాతం ఓట్లతో, ఈ నాలుగు ఎన్నికల్లోనూ ఒక్క స్థానం కూడా సాధించకుండా నోటాతో పోటీపడే పరిస్థితి వచ్చింది.రాష్ట్రంలో ఉనికి కోల్పోయి వెంటిలేటర్‌పై ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వై.ఎస్.షర్మిల జీవం పోస్తారా అనే చర్చ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోంది. వైఎస్‌ఆర్ మరణానంతరం రాష్ట్రంలో జరిగిన అనేక రాజకీయ పరిణామాలతో ఆయన కుటుంబం కాంగ్రెస్ పార్టీకి దూరమైంది. ఉమ్మడి ఏపీకి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి అరెస్టు కావడం, అనంతరం రాష్ట్ర విభజన పరిణామాలతో వైఎస్‌ఆర్ కుటుంబం తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది.