హైదరాబాద్, (సిరా న్యూస్);
: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో దిగిన రాజకీయ వారసులు ఈ సారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో పలువురు నేతలు తమ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎన్నికల బరిలోకి దిగారు. ఎన్నికల్లో దిగిన వారసుల విజయం సాధిస్తారా లేదా అనేది ఫలితాల కోసం డిసెంబర్ 3వతేదీ వరకు వేచిచూడాల్సిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమారుడైన రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖమంత్రి కేటీ రామారావు మరోసారి సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. సీపీఐ కురువృద్ధుడైన పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడు పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఖమ్మం బరిలో దిగారు.తెలంగాణలో కీలకమైన హోంశాఖ మంత్రులుగా పనిచేసిన, చేస్తున్న నేతల కుమారులకు ఈ సారి ఎన్నికల్లో టికెట్లు దక్కలేదు. సీఎం తర్వాత కీలకమైన హోంశాఖ మంత్రిగా గతంలో పనిచేసిన పట్టోళ్ల ఇంద్రారెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించాక ఆయన కుమారుడు కార్తీక్ రెడ్డికి ఈ సారి టికెట్ దక్కలేదు. గతంలో వైఎస్సార్ మంత్రివర్గంలో హోంశాఖ మంత్రిగా పనిచేసిన జానారెడ్డి కుమారుడప రఘువీర్ రెడ్డికి టికెట్ దక్కలేదు. మరో కుమారుడు జయవీర్ రెడ్డికి సాగర్ టికెట్ లభించింది.ఎలిమినేటి మాధవరెడ్డి భార్య ఉమా మాధవరెడ్డి, కుమారుడు సందీప్ రెడ్డి కి ఈ సారి టికెట్ లభించలేదు. దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ కు బీజేపీ నుంచి అవకాశం దక్కలేదు. దివంగత నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డికి కూడా టికెట్ దక్కలేదు. మరో వైపు ప్రస్థుత హోంమంత్రి మహమూద్ అలీ కుమారుడు ఆజాంఅలీకి కూడా టికెట్ దొరకలేదు. మొత్తంమీద హోంశాఖ మంత్రుల కుమారుల రాజకీయ ఆరంగ్రేటానికి ఆటంకం ఏర్పడినట్లయింది.మాజీమంత్రి ప్రణయ్ భాస్కర్ సోదరుడు దాస్యం వినయ్ భాస్కర్ వరంగల్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దివంగత కాంగ్రెస్ నేత లక్ష్మారెడ్డి సతీమణి సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.మాజీమంత్రి దివంగత ఇంద్రారెడ్డి భార్య సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నుంచి బరిలో నిలిచారు. దివంగత మల్లు అనంతరాములు కుమారుడు,సిట్టింగ్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మూడోసారి మధిర నుంచి తలపడుతున్నారు.మాజీ స్పీకర్ దుద్ధిళ్ల శ్రీపాదరావు కుమారుడు శ్రీధర్ బాబు మంథని నుంచి నిలిచారు.