సిరా న్యూస్,వరంగల్;
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన మానస పుత్రికగా చెపుపకుంటూ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ. 3,652 కోట్లతో నిర్మించిన ఈ బ్యారేజీ గతేడాది అక్టోబర్‌లో కుంగిపోయింది. ఏడో బ్లాక్‌తోపాటు 6, 8వ బ్లాక్‌లలోని ఇతర పియర్స్‌కు నష్టం వాటిల్లినట్లు విజిలెన్స్ అధికారులు అధ్యయనంలో గుర్తించారు. డిజైన్‌తోపాటు, నాణ్యత, నిర్వహణ లోపాలు ఉన్నట్లు అంచనాకు వచ్చిన అధికారులు మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు.ఇక విజిలెన్స్ చేస్తున్న అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. బ్యారేజీ 6, 8వ బ్లాక్‌లలో మరిన్ని పియర్స్‌కు నష్టం జరిగినట్లు గుర్తించాయి. బ్యారేజీ దిగువన ఒక్కొక్కటి 20 టన్నుల బరువుతో ఉన్న సిమెంటు బ్లాక్స్ వంద మీటర్లు దూరం కొట్టుకుపోవడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బ్యారేజీ కుంగుబాటుకు పియర్స్ దెబ్బతినడానికి నాణ్యత, నిర్వహణ లోపాలే కారణంగా భావిస్తున్నారు. మొదట గుర్తించిన పియర్స్ కాకుండా మరికొన్ని కూడా బీటలువారినట్లు గుర్తించారు. డిజైన్ లోపాలు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు.మేడిగడ్డ బ్యారేజీలో సమస్య రెండేళ్ల క్రితమే ప్రారంభమైనట్లు విజిలెన్స్ అధ్యయనంలో గుర్తించారు. నిర్వహణను పూర్తిగా విస్మరించడంతో బ్యారేజీ దెబ్బతిన్నట్లు అంచనా వేస్తున్నారు. బ్యారేజీ దిగువన నిర్మించిన సీసీ బ్లాక్‌లను పట్టించుకోకపోవడంతో అవి కదిలి ఇసుక జరిగినట్లు భావిస్తున్నారు. 2019లో బ్యారేజీని ప్రారంభించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందు, తర్వాత పరిశీలించాల్సిన ఇంజినీర్లు ఆ విషయాన్ని పట్టించుకోలేదని సమాచారం.మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో భారీగా అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ ప్రాథమికంగా నిర్దారించింది. మొత్తంగా 11 పిల్లర్లు దెబ్బతిన్నట్లు తేల్చింది. మరమ్మతులతో బ్యారేజీకి గ్యారెంటీ ఉండదని స్పష్టం చేసింది. బ్యారేజీ మొత్తం ప్రమాదంలోనే ఉన్నట్లు తేల్చారు. కాంక్రీటు మిక్సింగ్, లాగ్ బుక్ నిర్వహణకు సంధించిన రికార్డులు లేవని విజిలెన్స్ గుర్తించింది.