సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో మార్చి 16 నుంచి రాష్ట్రంలో మోడల్ కోడ్ అమల్లోకి వచ్చింది. నాటి నుంచి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల దాదాపు రూ.200 కోట్ల విలువైన నగదు, లిక్కర్, బంగారాభరణాలు, నార్కొటిక్ డ్రగ్స్ సీజ్ చేసినట్లు తెలంగాణ ఎన్నికల అధికారులు సోమవారం (జూన్ 3) విడుదల చేసిన మీడియా నివేదికలో వెల్లడించారు. వీటిని మార్చి 16 నుంచి జూన్ 3వ తేదీ మధ్యలో పోలీసులు సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్ జూన్ 6వ తేదీ వరకు అమల్లో ఉండనుంది.రూ. 99.16 కోట్ల నగదు, రూ. 11.48 కోట్ల విలువ చేసే మద్యం, రూ. 14.52 కోట్ల విలువైన నార్కోటిక్ డ్రగ్స్, రూ. 63.19 కోట్ల విలువ చేసే ఆభరణాలు, రూ. 11.91 కోట్ల విలువ చేసే ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు. మొత్తంగా 2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.200 కోట్ల 27 లక్షల 60 వేల విలువైన తాయిళాలు పట్టుబడ్డాయి. వీటిల్లో ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ అధికారులు రూ.50.73 కోట్లు సీజ్ చేయగా.. రాష్ట్ర పోలీసులు రూ.149.54 కోట్లు సీజ్ చేశారు. అలాగే 7,272 అక్రమ ఆయుధాలు, 20 లైసెన్స్ ఉన్న ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కాగా 2019 ఎన్నికల్లో కేవలం 46.3 కోట్ల విలువ చేసే నగదు, బంగారు ఆభరణాలు, మద్యం పోలీసులు సీజ్ చేయగా.. ఈ ఏడాది ఎన్నికల్లో దాదాపు మూడింతలు పెరిగింది. పొలిటికల్ లీడర్లు ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు రాబట్టడానికి కాసులు రాల్చడం, మద్యం ఏరులై పారేలా చేయడం షరా మామూలే. అయితే ఈసారి అదికాస్త సృతి మించిందనే చెప్పాలి
=============