Post Views: 41
సిరా న్యూస్,అమరావతి;
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాలుగు నెలల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం కనీసం లక్ష కోట్ల రూపాయలు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మొత్తాన్ని ఎలాగైనా సమీకరించాలని ఆర్థికశాఖను ఆదేశిం చింది. దీంతో ఈ మేరకు ఉన్న అవకాశాలపై ఆర్థిక శాఖకు చెందిన ఉన్నతాధికారులు కసరత్తు చేస్తు న్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో పథకాల అమలులో ఏ మాత్రం నిర్లక్ష్యం ఉండకూడదని ఈ సమావేశంలో సిఎం ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో పాటు, ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మరికొందరు కూడా నిధుల సమీకరణపై దృష్టి సారించినట్లు తెలిసింది. లక్ష కోట్ల రూపాయలకన్నా మరికొంత ఎక్కువ మొత్తమే అవసరమౌతుందన్న అభిప్రాయాన్ని వీరు వ్యక్తంచేస్తున్నట్లు సమాచారం. కొన్ని పథకాలు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు కాలేదని, మరికొన్ని పథకాల్లో రకరకాల పేర్లతో లబ్ధిదారులను కుదించారని, అటువంటి లోపాలన్నింటిని తక్షణమే దిద్దుకోవాలని వివిధ ప్రభుత్వ శాఖలకు కూడా ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది.ముఖ్యంగా సామాజిక ఫించన్లు ఏ కారణంతోనైనా అందడం లేదన్న ఫిర్యాదు లబ్ధిదారుల నుండి రాకూడదని ప్రభుత్వం భావిస్తున్న ట్లు సమాచారం. దీంతో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్య కూడా రానున్న నాలుగు నెలల్లో పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనిని కూడా దృష్టిలో పెట్టుకుని నిధుల కొరత లేకుండా చూడాలని ఆర్థికశాఖకు సూచించినట్లు తెలిసింది.అక్టోబర్ వరకు పరిశీలిస్తే అనుకున్న ఆదాయం కన్నా తక్కువగానే రికార్డయింది. రాష్ట్ర, కేంద్ర నిధులతో కలిపి 2.60 లక్షల కోట్లు రావాల్సి ఉంటుందని అంచనా వేయగా, తొలి ఏడు నెలలకు లక్ష కోట్లుకన్నా తక్కువగానే వచ్చింది. ఇక మిగిలిన ఐదు నెలల్లో 1.10 లక్షల కోట్లు రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. అనుకున్నట్లుగా ఆ మొత్తం ఆదాయం లభించినా కూడా చివరి నెలల్లో ఖర్చులు గణనీయంగా పెరుగుతాయని, అందుకే ఆ నిధులు ఎంతమాత్రం చాలవని ఆర్థికశాఖ అధికారులు అంటున్నారు.