శ్రీకాకుళం;
రాష్ట్రంలో వైకాపా అసెంబ్లీ టిక్కెట్ల వ్యవహారం ఓ కొలిక్కి వస్తున్నా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఎనిమిది నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక అధిష్టానానికి తలనొప్పిగా మారింది. జిల్లాలో రెండు సీట్లు మినహా మిగిలిన ఆరు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు ఎవరనేదానిపై తాడేపల్లిలో కుర్చీలాట జరుగుతోంది. ఇంతవరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పలు రూపాల్లో జరుపుకొన్న సర్వేల ప్రకారం అభ్యర్థులను నిర్ణయించడానికి కూడా ఇక్కడ సీనియర్లు అడ్డొస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల ప్రకటన ఓ కొలిక్కి వచ్చినా జిల్లాకు సంబంధించి మాత్రం మరో 15 రోజులు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.తొలివిడతలో 11, రెండో విడతలో 27 మొత్తం కలిపి 38 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త నేతలను ప్రకటించినా జిల్లాలో మాత్రం ఏ నిర్ణయానికీ రాలేకపోతున్నారు. ఇక్కడ సీనియర్లు ఎక్కడికక్కడ పీఠముడి వేయడంతో తేల్చుకోలేకపోతున్నారు. ఇచ్ఛాపురంలో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జి పిరియా సాయి రాజ్ కు టిక్కెట్ ఇస్తారని ఇంతకు ముందే జగన్ మోహన్ రెడ్డి మాటిచ్చారు.