సిరా న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ అభివృద్దే ధ్యేయంగా ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి సంజీవరెడ్డి తెలిపారు. టిపిసిసి మాజీ రాష్ట్ర కార్యదర్శి గండ్ర సుజాత, డిసిసి మాజీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, ఇతర నాయకులతో కలిసి ఆయన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లోని పలు గ్రామాల్లో పర్యటించారు. భోరజ్, గూడా, సిర్సన్న, గిమ్మ, ఆకోలి, కోర్ట, తదితర గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. స్వర్గీయ మాజీ మంత్రివర్యులు సి రామచంద్రారెడ్డి ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని అన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి స్థలాలు అందించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఆదిలాబాద్ రిమ్స్ సాధించి నిరుపేదలకు అండగా నిలిచారని అన్నారు. సి ఆర్ ఆర్ ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు వెళుతున్న తనను ప్రజలు ఆశీర్వదించాలని, రానున్న ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.