సిరా న్యూస్, ఆదిలాబాద్:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం…
-సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్ వెస్లీ
ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్ వెస్లీ ఆరోపించారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో నిర్వహించిన పార్టీ ప్లీనరీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కార్పోరేటర్లకు కొమ్ము కాస్తూ, కార్మికులు, కర్షకుల పొట్టకొడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం దోపిడి విధానాల వలన సంపద కొద్ది మంది చేతుల్లో పోగవుతోందని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరుగుతోందని, దళితులపై దాడులు సైతం ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. గత బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని, నిరంకుశ పాలన వైఖరితో ఈ ఎన్నికల్లో ఓటమి పాలైందన్నారు. రాష్ట్రంలొ కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రేస్ ఆరు గ్యారెంటీలను వెంటనే మలు చేయాలని ఆయన డిమాండ్ చేసారు. రాష్ట్రంలో 13లక్షల ఎకరాల పోడు భూమి ఉంటే కేవలం 3లక్షల ఎకరాలకు మాత్రమే పట్టాలు పంపిణీ చేసారని, వెంటనే మిగిలిన 10లక్షల ఎకరాలకు సైతం పట్టాలు అందించాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇంచార్జీ బండారు రవి కుమార్, జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, పార్టీ కార్యవర్గ సభ్యులు లంక రాఘవులు, సీనియర్ నాయకులు బండి దత్తాత్రి, జిల్లా కార్యవర్గ సభ్యులు అన్నమెల కిరణ్, పూసం సచిన్, నాయకులు బొజ్జ ఆశన్న, మంజుల, సురేందర్, శంకుతల, జమున, తదితరులు పాల్గొన్నారు.
