ముద్రగడ టు వంగవీటి –

ఆపరేషన్ ఆకర్ష్‌లో వైసీపీ తడబాటు
సిరా న్యూస్,విజయవాడ;
ఎన్నికలు ముంచుకు వస్తున్న సమయంలో ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ బలోపేతం, విపక్ష పార్టీలకు కౌంటర్ ఇచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు రివర్స్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తులు గేమ్ ఛేంజర్ గా మారబోతున్నాయన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా కాపు సామాజికవర్గం మొత్తం ఏకతాటిపైకి వస్తుందన్న సంకేతాలు బలపడుతూండటంతో వైఎస్ఆర్‌సీపీ అధినేత సీఎం జగన్ బలమైన కాపు నేతల్ని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అన్ని ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. జనసేన పార్టీకి, పవన్ కల్యాణ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా క్రికెటర్ అంబటి రాయుడును పార్టీలోకి తీసుకోవాలని అనుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంతో సీఎం జగన్‌కు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ అధినేత శ్రీనివాసన్ కొన్ని జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితడిగా ఉన్నారు. ఈ క్రమంలో ఉన్న సంబంధాలను ఉపయోగించుకుని అప్పటికీ ఐపీఎల్ లో ఆడుతున్న అంబటి రాయుడును రాజకీయాల్లోకి ఆకర్షించినట్లుగా తెలుస్తోంది. ఐపీఎల్‌లో కీలక మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలోనే రెండు, మూడు సార్లు తాడేపల్లికి వచ్చి సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. తర్వాత సీఎస్కే కప్ గెలిచిన సందర్భంలో ఆ కప్‌ను తీసుకొచ్చి సీఎం జగన్‌కు చూపించారు. ఐపీఎల్ ముగిసినప్పుడే తన కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు.. ఆ తర్వాత వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కోసం పర్యటను చేశారు. గుంటూరు పార్లమెంట్ స్థానం టార్గెట్ గా ఆయన ఆ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటనలు చేశారు. ఆయన పర్యటనను ఐ ప్యాక్ సభ్యులు కోఆర్డినేట్ చేశారని ఇమేజ్‌ను బిల్డ్ చేసే ప్రయత్నాలు చేశారని వైసీపీ వర్గాాలు చెబుతాయి. తర్వాత ఆయన అధికారికంగా వైసీపీలో చేరారు. కానీ పది రోజులకే రాజీనామా చేశారు. నిజానికి అంబటి రాయుడుతో పవన్ కల్యాణ్ ప్రభావానికి కొంత చెక్ పెట్టవచ్చని అనుకున్నారు. కానీ వైసీపీకి రాజీనామా చేసిన కొద్ది రోజులకే పవన్ కల్యాణ్ ను కలిసిన అంబటి రాయుడు తమ వేవ్ లెంగ్త్ కలిసిందని ప్రకటించారు. పవన్ కల్యాణ్‌తో కలిసి పని చేస్తానని కూడా చెప్పారు . దీంతో అంబటి రాయుడు ప్రయోగం వైసీపీకి వికటించినట్లయింది. ఇక పవన్ కల్యాణ్‌తోనే ఢీ అంటే ఢీ అన్నట్లుగా సవాళ్లు చేసిన ముద్రగడ పద్మనాభం ద్వారా పవన్ ప్రభావాన్ని తగ్గించి కాపు ఓట్లలో చీలిక తేవాలని సీఎం జగన్, వైసీపీ వ్యూహకర్తలు వైసిన ప్రణాళికలు కూడా రివర్స్ అయ్యాయి. నిజానికి ముద్రగడ పద్మనాభం వైసీపీకి చాలా దగ్గర. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని తీవ్ర స్తాయికి తీసుకు వెళ్లడం ద్వారా ఆయన ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచగగలిగారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడి వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టలేదు. పైగా ఉద్యమం నుంచి వైదొలుగుతున్నానని ప్రకటించారు. పవన్ కల్యాణ్‌తో సవాళ్లు కూడా చేశారు. వారాహి యాత్ర సందర్భంగా తనపై పోటీ చేయాలని పవన్ కు ముద్రగడ సవాల్ చేశారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ చేసిన విమర్శలను తాను తిప్పికొట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *