సిరా న్యూస్, ఆదిలాబాద్:
మంత్రి తుమ్మల వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదు…
– బాలూరి గోవర్ధన్ రెడ్డి
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలను బిఆర్ఎస్ నాయకులు వక్రీకరించడం సరికాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేశారు. బిఆర్ఎస్ శ్రేణులు మంత్రి మాటలను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో సత్య దూరమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రుణమాఫీ చేయకుండానే రైతుల నుండి రుణాలు వసూలు చేయాలని మంత్రి ఆదేశించినట్లు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. వ్యవసాయ రుణాలు కాకుండా వివిధ పథకాల కింద రుణాలు తీసుకున్న రైతుల నుంచి రుణాలు రికవరీ చేయాలని ప్యాక్స్, డీసీసీబీలను మంత్రి ఆదేశించినట్లు ఆయన తెలిపారు. వ్యవసాయేతర రుణాలైనటువంటి పీఎం ఈ జి పి , గృహ రుణాలు, తనఖా రుణాలు, సమూహ రుణాలు వ్యక్తిగత రుణాలకు సంబంధించిన ఓవర్ డ్యూలను రికవరీ చేయాలని మాత్రమే మంత్రి ఆదేశించారని ఆయన స్పష్టం చేశారు. బిఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో పెడుతున్న ఫేక్ పోస్టులను రైతులెవరు నమ్మరాదని ఆయన విజ్ఞప్తి చేశారు.