సిరా న్యూస్,నెల్లూరు;
చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరులో వైసీపీ సీటు పంచాయితీ రచ్చకెక్కింది. ఉమ్మడి జిల్లాలో ఆరు సెగ్మెంట్లతోపాటు తిరుపతి ఎంపీ స్థానంలో అభ్యర్థులను మార్చేసింది అధిష్టానం. మిగిలిన గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పరిస్థితి అయోమయంగా మారింది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామికి టికెట్ కేటాయింపు విషయంలో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఆయనకే టికెట్ ఇవ్వాలని కొందరు.. వద్దని మరికొందరు ఏకంగా బల ప్రదర్శనకు దిగడంతో పరిస్థితి గందరగోళంగా మారింది.చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో రాజకీయం రసకందాయంలో పడింది. డిప్యూటీ సీఎంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయణస్వామి.. ఈసారి తన కూతురు కృపాలక్ష్మికి టికెట్ ఇప్పించాలని చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు ఫలించలేదు. దీంతో మరోసారి పోటీచేసి.. హ్యాట్రిక్ కొట్టాలని నారాయణస్వామి భావిస్తున్నారు. అయితే.. ఆయనకు టికెట్ ఇవ్వొద్దని మరో వర్గం ఆందోళనకు దిగడంతో అయోమయ పరిస్థితి నెలకొంది.గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కొంతకాలంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి వర్సెస్ ప్రభుత్వ సలహాదారు జ్ఞానేందర్‌రెడ్డిగా సాగుతోంది. అధికార పార్టీ విడుదల చేయనున్న నాలుగో లిస్టులో ఈ సెగ్మెంట్ సీటు దక్కేదెవరికో తెలియనుంది. ఈలోగానే పార్టీలోని రెండు వర్గాలు బల ప్రదర్శనలకు దిగడం ప్రారంభించాయి. ఇటీవలే సమావేశమైన జ్ఞానేందర్‌రెడ్డి వర్గం.. నారాయణస్వామికి టికెట్ కేటాయించొద్దని డిమాండ్ చేశాయి.ఇటీవలే జ్ఞానేందర్‌రెడ్డి అనుచరులు, 6 మండలాలకు చెందిన కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణస్వామికి టికెట్ కేటాయించొద్దని తీర్మానం చేశారు. అంతేకాదు, నారాయణస్వామి వద్దు.. జగనన్నే ముద్దు అన్న నినాదాలు చేస్తూ.. ప్లకార్డులు ప్రదర్శించారు. నారాయణ స్వామికి టికెట్ ఇస్తే పనిచేయబోమని.. వేరే ఎవరికి టికెట్ ఇచ్చినా భారీ మెజార్టీతో గెలిపిస్తామని తేల్చిచెప్పారు వారంతా.వెంటనే రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి వర్గం ఆయనకు మద్దతుగా సమావేశం నిర్వహించింది. 6 మండలాలకు చెందిన నాయకులంతా.. నారాయణ స్వామే ముద్దు.. ఇతరులు వద్దంటూ ప్లకార్డులతో బల ప్రదర్శన చేపట్టారు. వచ్చే జాబితాలో నారాయణస్వామికి టికెట్ ఖరారు కాకపోతే సీఎం జగన్‌ను కలుస్తామని ప్రకటించారు వారంతా. భూకబ్జాలకు పాల్పడుతున్న జ్ఞానేందర్‌రెడ్డి కుటుంబాన్ని ప్రశ్నించినందుకే నారాయణస్వామికి టికెట్ ఇవ్వొద్దంటున్నారని మండిపడుతున్నారు ఆయన వర్గం నేతలు.ఇలా గంగాధర నెల్లూరులో తారస్థాయికి చేరింది వైసీపీ టికెట్ పంచాయితీ. ఎవరికి వారుగా ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా మరో జాబితా విడుదలైతే గానీ నారాయణస్వామి భవితవ్యం తేలే అవకాశం లేదు.