సిరా న్యూస్,అయోధ్య ;
అయోధ్యలో రామయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం మధ్యాహ్నం బాలరాముడు భవ్య మందిరంలో కొలువైన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం నుంచి సాధారణ భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నారు. దీంతో రామలవారి దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున 3 గంటలకే మందిరం వద్దకు చేరుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఆలయంలోకి అనుమతిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయ ప్రధాన ద్వారం వద్దకు ఒకేసారి రావడంతో తోపులాటకు దారితీసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.కాగా, ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 వరకు అయోధ్య రామయ్య దర్శనం కల్పిస్తున్నారు. అయితే పెద్దసంఖ్యలో భక్తులు వస్తుండటంతో దర్శన వేళలను పొడిగించాలని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు యోచిస్తున్నది. ఆలయ పరిసరాల్లో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.