-ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమైనది
-మంథని ఆర్డీఓ హనుమా నాయక్
-మంథని నియోజకవర్గ కేంద్రం లో ఘనంగా 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం
సిరా న్యూస్,మంథని;
ప్రతీ పౌరుడు తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమైనదని మంథని ఆర్డీఓ హనుమా నాయక్ పేర్కొన్నారు. గురువారం 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మంథని పట్టణంలో ఆర్డిఓ హనుమ నాయక్ అధ్యక్షతన పలు పాఠశాలల విద్యార్థులచే, కార్యాలయ సిబ్బందిచే ఘనంగా ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మొదటగా బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆర్డీవో హనుమా నాయక్ ఓటు యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం బాలుర ఉన్నత పాఠశాల మైదానం నుండి గాంధీ చౌక్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. తదుపరి అంబేద్కర్ చౌక్ వద్ద విద్యార్థుల చేత మానవహారం నిర్వహించి ఓటరు ప్రతిజ్ఞను చేయించారు. తిరిగి బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి సీనియర్ సిటిజన్స్ ను, మొట్టమొదటి సారిగా ఓటరుగా నమోదై, ఓటు వేసిన యువ ఓటర్లను ఘనంగా శాలువాతో సన్మానించి సత్కరించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో హనుమా నాయక్ ప్రజాస్వామ్యం లో ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశం ప్రపంచ దేశాలలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, గతంలో ఓటు హక్కు వయోపరిమితి 21 సంవత్సరాలు ఉండేదని, తదుపరి కాలంలో 18 సంవత్సరాలకు చేశారని ఆయన వివరించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంథని నియోజకవర్గంలో 82% ఓటింగ్ జరిగిందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనైనా 100% ఓటింగ్ జరగాలని ఆయన సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కు దరఖాస్తు చేసుకోవాలని, ఓటు హక్కు ద్వారానే ప్రజాస్వామ్య ప్రభుత్వ నిర్మాణం ఏర్పాటవుతుందని, కావున ప్రతీ పౌరుడు తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. కాగా, ఈ కార్యక్రమంలో మంథని తహసిల్దార్ డి.రాజయ్య, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ తూము రవీందర్, నాయబ్ తహసిల్దార్ ఎలక్షన్ ఠాకూర్ సంతోష్ సింగ్, నాయబ్ తహసిల్దార్ ఎస్.గిరి, మండల గిర్దావర్లు వెంకట రాజు, త్రివేణి, ఆర్దిఒ మరియు తహసిల్దారు కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థులు, యాజమాన్యం, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, బూతు లెవెల్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.