సిరా న్యూస్,తాడేపల్లిగూడెం;
తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ లో యార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సత్యనారాయణ అనే ఉద్యోగి అవినీతికి పాల్పడుతుండగా ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. తాడేపల్లిగూడెం రూరల్ మండలం పెద్దతాడేపల్లి వద్ద ప్రతి శని,సోమవారాలలో మేకల సంత జరుగుతుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మేకలు,గొర్రెలు పెంపకం దారులు ఇక్కడకు వాటిని తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. దీని మీద జీవానికి కొంత మొత్తం మార్కెట్ కమిటీ సెస్సు వసూలు చేస్తుంది. అయితే మేకల సంత ద్వారా మార్కెట్ కమిటీకి రావాల్సినంత ఆదాయం రావడంలేదని, ఉద్యోగులు చేతివాటం ద్వారా ప్రక్కదారి పడుతుందని గతం నుంచి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏఎంసీ ప్రస్తుత చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే అధికారులతో సమావేశం నిర్వహించి మేకల సంతలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని, మార్కెట్ కమిటీకి రావాల్సిన ఆదాయాన్ని ఖచ్చితంగా రాబట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆకస్మిక తనిఖీ లో భాగంగా శనివారం ఉదయం మేకల సంత వైపు వెళుతూ చేతివాటం ప్రదర్శించిన ఉద్యోగి సత్యనారాయణ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మేకలతో వెళుతున్న ఒక వ్యాన్ డ్రైవర్ నుంచి ఆ ఉద్యోగి డబ్బులు తీసుకుంటుండగా ప్రత్యక్షంగా చూసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని నిలదీశారు. డబ్బులు ఇచ్చిన ఆ వ్యక్తిని, డబ్బులు తీసుకున్న ఆ ఉద్యోగిని కూడా అక్కడికక్కడే నిలదీసి విచారించారు. ప్రభాకర్ కు చైర్మన్ సంపత్ ఫోన్ ద్వారా తెలియజేసే అవినీతికి పాల్పడిన ఉద్యోగిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అవినీతిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోకపోతే అవసరమైతే సెక్రటరీ పై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసేందుకు కూడా వెనుకాడేది లేదని ఏఎంసీ చైర్మన్ సంపత్ స్పష్టం చేశారు. ఈ విషయమై ఏఎంసి సెక్రెటరీ ప్రభాకర్ ను వివరణ కోరగా మేకల సంతలో ఆదాయం పక్కదారి పట్టకుండా నిరంతరం పర్యవేక్షించేలా సూపర్వైజర్లను నియమించమన్నారు. అలాగే చైర్మన్ ఆకస్మిక తనిఖీ లో చేతివాటం ప్రదర్శిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన యార్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ పై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ ఆకస్మిక తనిఖీ లో రెడ్ హ్యాండెడ్ గా అవినీతి ఉద్యోగిని పట్టుకుని మార్కెట్ కమిటీ ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది.