సిరా న్యూస్, హైదరాబాద్:
పాత కాంట్రాక్ట్ ను రద్దుచేసి, లబ్ధిదారులకే నిర్మాణ బాధ్యతల అప్పగించాలి…
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని రాంపూర్-టి గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన 100 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించిన పాత కాంట్రాక్ట్ ను రద్దుచేసి, లబ్ధిదారులకే ఇండ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి కోరారు. మంగళవారం ఆయన రాంపూర్-టి సర్పంచ్ అల్లం లింగన్న, డిసిసిబి చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తుమ్మల వెంకటరెడ్డి, ఇతర నాయకులతో కలిసి హైదరాబాద్ లో మంత్రి సీతక్కను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. రాంపూర్ గ్రామంలో 100 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేసిన ప్రభుత్వం, నిర్మాణ బాధ్యతలను ఓ కాంట్రాక్టర్ కు అప్పగించిందని అన్నారు. సదరు కాంట్రాక్టర్ పనులు చేపట్టకపోవడంతో, లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవడంతో పాటు కాంట్రాక్ట్ ను రద్దు చేయాలని కోరారు. స్థానికంగా ఉన్న లబ్ధిదారులకే ఇండ్ల నిర్మాణ బాధ్యతలను అప్పగించే విధంగా అధికారులను ఆదేశించాలని మంత్రిని కోరారు. కాగా సానుకూలంగా స్పందించిన మంత్రి జిల్లా కలెక్టర్ కు త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.