జంగుబాయి జాతరకు అంతా సిద్ధం

సిరా న్యూస్,అదిలాబాద్;
అడవిలో ఆదివాసీల సంబురం మొదలైంది. దేశ నలుమూలల నుండి అడవి బిడ్డలు తమ ఆది దైవాన్ని కొలిచేందుకు ఊరురంతా కుటుంబ సభ్యులతో కలిసి తరలివస్తున్నారు. సాంప్రదాయ డోలు వాయిద్యాల నడుమ సందడి నెలకొంటు అడివమ్మ ఓడిలో జాతర కొనసాగుతోంది. అడవికి ఆదివాసులకు ఉన్న అనుబంధమే ఈ జాతర. గుట్టను చెట్టును పూజించే అడవి బిడ్డలు ప్రకృతితో మమేకమై ప్రకృతిని పూజిస్తూ నేటికీ తమ సంస్కృతికి అద్దంగా నిలుస్తున్నారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో కొలువైన తమ ఆది దైవాన్ని దేశంలో ఉన్న ఆదివాసిలంతా యేటా పుష్య మాసంలో భక్తిశ్రద్ధలతో కొలుస్తూ, అడివమ్మ ఒడిలో జాతరను జరుపుకుంటున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరామేరి మండలంలోని కోటా పరందోలి అడవుల్లో కొలువైన ఆదివాసీల పవిత్ర పుణ్యక్షేత్రం జంగుబాయి జాతర.
దీపమే జంగుబాయి
తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో గల.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరామెరి మండలంలోని కోటా పరందోలీ అడవుల్లో కొలువైన ఆదివాసీల పవిత్ర పుణ్యక్షేత్రం ఇది. దీన్ని జంగుబాయి పుణ్యక్షేత్రంగా పిలుస్తారు. మరికొందరు ఆయా రాష్ట్రాల భాషల పరంగా రాయితాడ్ జంగు దేవస్థాన్, భిడ్ వార్ గోంది, జంగుబాయి మహెళ్, జంగోదేవి సంస్థాన్, అని పలు రకాల పేర్లతో పిలుస్తుంటారు. సహ్యాద్రి పర్వతాల చుట్టూ దట్టమైన అడవుల మధ్య కొలువై ఉంది ఈ జంగుబాయి పుణ్యక్షేత్రం. జంగుబాయికి రూపం లేదు. ఈ మహెల్ లోని గుహలో వెలిగే దీపమే జంగుబాయి. దీపమే దైవంగా భావిస్తూ తమ పూర్వీకుల నుండి ఏటా పుష్య మాసంలో భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో కాళ్లకు చెప్పులు లేకుండా కాలినడకన పాదయాత్రగా వచ్చీ ఆదివాసీలు సాంప్రదాయ రీతిలో డోలు వాయిద్యాలు వాయిస్తూ జంగుబాయి పుణ్యక్షేత్రంలో పూజలు చేసి దర్శించుకుంటున్నారు. జంగుబాయి అంటే ఆది దైవం. జంగుబాయిని దర్శించుకోవాలంటే తమ గోత్రాల పరంగా ఏర్పడిన కులదైవాలను పెర్సాపేన్, భిమల్ పేన్, జంగుబాయి, ల ప్రతిమలను ఎత్తుకొని, సంప్రదాయ జెండాలు పట్టుకుని డోలు సన్నాయి వాయిద్యాలు వాయిస్తూ, పునకాల మద్య దైవ విన్యాసాలు చేస్తూ.. నృత్యాలు చేస్తూ.. కాలినడకన ముందుగా టోప్లాకాసా అనే ఈ నది ఒడ్డున చేరుకుని గంగా స్నానాలు ఆచరించి, అక్కడి నుండి రావుడ్ పేన్, అవ్వల్ పేన్, దేవతలను దర్శించుకొని, వాగులో నుండి జంగుబాయి మహేల్ వద్ద ఉన్న మైసమ్మ ను పూజించి, అపైనే జంగుబాయి గుహలోపలికి వెళ్తారు. జంగుబాయి గుహలోకి వెళ్లి వెలిగే జ్యోతిని దర్శించుకుంటారు. ఈ వెలిగే జ్యోతి జంగుబాయి అని ఆదివాసీలు పూర్వకాలం నుండి విశ్వసిస్తూ తమ ఆది దైవాన్ని భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నారు. అ అంటే అడవి.. ఆ అంటే ఆదివాసి.. అడవికి ఆదివాసులకు మధ్య ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. అడవుల్లో నివసిస్తూ.. అడవిలో ఉండే చెట్టు, గుట్టా, పుట్టను పూజించే అడవి బిడ్డలు ప్రకృతిని ఆస్వాదిస్తూ తమ పూర్వకాలం నుండి వస్తున్న ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఏటా పుష్య మాసంలో భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో కాళ్లకు చెప్పులు ధరించకుండా నెల రోజుల పాటు తమ ఆది దైవాలను కొలుస్తున్నారు. యావత్ భారత దేశంలో ఉన్న ఆదివాసిలంతా ప్రతి ఏటా పుష్య మాసంలో ఖచ్చితంగా జంగుబాయి సన్నిధికి చేరుకొని పూజలు చేసి దర్శించుకుంటారు. ఒక్కరంటే ఒక్కరు కాదు పుష్య మాసంలో ఆదివాసి గూడాలన్నీ కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో కలిసి జంగుబాయిని దర్శించుకుంటారు. ఆపై ఆలయ ప్రాంగణంలో సాంప్రదాయ పిండి వంటకాలు చేసి దేవుళ్లకు నైవేద్యం సమర్పించి ఆపై కుటుంబ సమేతంగా సహపంతి భోజనాలు ఆచరించి తిరిగి తమ తమ గ్రామాలకు పయనమవుతారు. జంగుబాయిని దర్శించుకుంటే తమ పిల్లలు, కుటుంబాలు, ఊరురంతా.. తమ పాడి పశువులు పంటలు అన్ని బాగుంటాయి. అందరూ సుఖంగా ఉంటారని ఆదివాసీల నమ్మకం. కోరిన కోరికలు తీరుస్తూ ఆదుకునే దైవమని, ఏదైనా అనుకుంటే అది కచ్చితంగా నెరవేర్చే దైవమని, పూర్వీకుల నుండి తమ ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ నేటికీ తమ సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ తమ ఆది దైవాలను కొలుస్తున్నామని ఆదివాసీలు చెబుతున్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి జంగుబాయి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *