ప్రజాస్వామ్య ఫలాలు అందరికీ సమానంగా అందేలా కృషి చేయాలి
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
సిరా న్యూస్,జగిత్యాల;
మహాత్మా గాంధీ సిద్ధాంతాలు నేటి పాలకులు, ప్రజలకు ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రపంచదేశాలకే అనుసరణీయమని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.మంగళవారం కలెక్టరేట్ లో సమావేశ మందిరంలో వర్ధంతి సందర్భంగా అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, దివాకర లతో కలిసి మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో మహాత్మ గాంధీజీ జాతిని ఏకం చేసేందుకు సత్యం, ధర్మం, అహింసాలను ఆయుధంగా మలుచుకొని విభిన్న సంస్కృతి, విభిన్న ఏకత్వాలను ఏకాభిప్రాయంగా తీసుకోని స్వాతంత్ర్య ఉద్యమంలో ఎందరో దేశభక్తుల ఐకమత్యంతో స్వాతంత్ర్యం సాధించారని తెలిపారు. అందరికి ప్రజాస్వామ్య ఫలాలు అందే విధంగా బాధ్యతాయుతంగా అందరి అవసరాలకు అనుగుణంగా ఉండి మనమంతా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. బాపూజీ చూపిన సత్యం, అహింసా మార్గాలు భావితరాలకు బంగారు బాటగా నిలిచాయని, ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన బాపూజీ తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి భారత దేశంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే తనదైన గుర్తింపు పొందారు. మహోన్నత వ్యక్తిగా అవతరించారు. మహాత్ముడి జన్మదినమైన అక్టోబర్ 2ను ఐక్యరాజ్య సమితి ‘అంతర్జాతీయ అహింసా దినోత్సవం’గా ప్రకటించింది. ఇది భారతీయులకు ఎంతో గర్వ కారణం. భారతీయులుగా ఆయన నమ్మిన సిద్ధాంతాలను ఆచరించినపుడే ఆయన ఆశయాలకు ఒక అర్థం, పరమార్థమని మహాత్ముడి జీవితం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని కలెక్టర్ పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, దివాకర, కలెక్టరేట్ ఏ.ఓ. హన్మంతరావు, ఎస్సీ కార్పోరేషన్ ఈ.డి. లక్ష్మి నారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.