జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
సిరా న్యూస్,పెద్దపల్లి;
జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఎస్.డి.ఎఫ్., డి.ఎం.ఎఫ్.టి, సి.డి.పి, సి.ఎస్.ఆర్., సి.బి.ఎఫ్. ఫండ్స్ అభివృద్ధి పనుల పురోగతిపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, జిల్లాలో ఎస్.డి.ఎఫ్., డి.ఎం.ఎఫ్.టి, సి.డి.పి, సి.ఎస్.ఆర్., సి.బి.ఎఫ్. ద్వారా మంజూరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై ఇక నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ నిర్వహించి పురోగతి సమీక్షించడం జరుగుతుందని, ఇప్పటివరకు ప్రారంభం కాని పనులలో అత్యంత అవసరమైన పనులను అధికారులు గుర్తించి వెంటనే ప్రారంభం చేసి రాబోయే సమావేశం నాటికి నివేదిక అందించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రోడ్డు, డ్రైయిన్, లైటింగ్ పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించి త్వరగా పూర్తయ్యే విధంగా చూడాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మంజూరు చేసిన గర్ల్స్ టాయిలెట్ నిర్మాణ పనులు, అంగన్వాడి కేంద్రాల పనులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేయాలని అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మంజూరు చేసిన పనులలో ప్రారంభించిన వాటిని త్వరగా పూర్తయ్యే విధంగా చూడాలని, జిల్లా వ్యాప్తంగా ఒకే విధంగా బస్సు షెల్టర్లు ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. గతంలో వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన చోట డ్రైయిన్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. రాబోయే సమావేశానికి అధికారులు ప్రస్తుతం జరుగుతున్న పనుల వివరాలు, ఆ పనులు పూర్తయ్యే తేదీని తెలియజేస్తూ రిపోర్టు సమర్పించాలని, జిల్లా వ్యాప్తంగా వాటర్ లాగింగ్ జరగకుండా అవసరమైన చోట్ల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని, వైకుంఠధామానికి రోడ్డు మార్గం ఉండే విధంగా ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్.డి.ఎఫ్., డి.ఎం.ఎఫ్.టి, సి.డి.పి, సి.ఎస్.ఆర్., సి.బి.ఎఫ్ నిధుల కింద మంజూరు చేసిన పనుల వారిగా కలెక్టర్ సమీక్షించారు. ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి గంప రవీందర్, ఈఈ పంచాయతీ రాజ్ బి.గిరీష్ బాబు, పంచాయతీ రాజ్ శాఖ ఎస్. ఈ. సిహెచ్. రషీద్, ఈఈ ఆర్ అండ్ బీ సి. రాములు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.