మేనిఫెస్టో, టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటన అప్పుడే..

చంద్రబాబు – పవన్ భేటీపై ఉత్కంఠ..
సిరా న్యూస్,అమరావతి;
తెలుగుదేశం-జనసేన పొత్తులో భాగంగా కొన్ని స్థానాల్లో రెండు పార్టీలకు బలమైన అభ్యర్థులు ఉన్నారు. దీంతో ఒకరికి అవకాశం ఇస్తే వేరొకరి నుంచి ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల చంద్రబాబు మండపేట,అరకు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో పోటీగా పవన్ కళ్యాణ్ కూడా రాజానగరం, రాజోలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో ఈ రెండు నియజకవర్గాల్లో టీడీపీ కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. మరికొన్ని స్థానాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నకొద్దీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. వచ్చే నెల మొదటి వారంలో తెలుగుదేశం-జనసేన సీట్ల సర్దుబాటుపై ప్రకటన చేసేలా కసరత్తు చేస్తున్నాయి. మొదటి విడత జాబితాపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. రా.. కదలిరా సభలకు స్వల్ప విరామం ప్రకటించి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. త్వరలోనే చంద్రబాబు-పవన్ కలిసి ఫస్ట్ లిస్ట్ తో పాటు ఉమ్మడి మేనిఫెస్టో పైన చర్చించే అవకాశముంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల కసరత్తు వేగవంతం చేసింది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పటికే అభ్యర్థులు ఎంపికపై పలు విధాలుగా సర్వే చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కన్ఫర్మ్ అని గతంలోనే చెప్పిన చంద్రబాబు.. వాటితో పాటు మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేలా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జనసేనతో సీట్ల సర్దుబాటుపై పలుమార్లు చర్చించారు. ఒకవైపు జిల్లాల వారీగా బహిరంగ సభల నిర్వహణతో ప్రజల్లోకి వెళ్తున్న చంద్రబాబు.. వాటికి కాస్త విరామం ప్రకటించారు. ఇప్పటివరకూ 17 చోట్ల బహిరంగ సభలు ముగిశాయి. మరో 9 చోట్ల సభలు జరగాల్సి ఉన్నాయి. వచ్చే నెల 4,5,6 తేదీల్లో తిరిగి రా.. కదలిరా సభలు నిర్వహించనున్నారు. ఈలోగా అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా జనసేనతో సీట్ల సర్దుబాటు విషయంలో ఇరు పార్టీల అధినేతలు కలిసి చర్చించనున్నారు. ఇవాళ లేదా రేపు చంద్రబాబు తో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో భేటీ అవుతారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *