తిరుపతి, (సిరా న్యూస్);
నారా రోహిత్..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు తనయుడు. అంటే చంద్రబాబు నాయుడుకు కుమారుడి వరుస. సినిమాల్లో నారా రోహిత్ తన టాలెంట్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. రోహిత్ సినిమాలు అంత సూపర్ డూపర్ హిట్ కాకపోయినా ఫ్యామిలీ హీరోగా అందరి మన్నలను అందుకున్నారు. ఇకపోతే నారా వారి కుటుంబం అంటే తెలుగుదేశం కుటుంబం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు రాజకీయాల్లో సైతం దూకుడుగా ఉంటారు నారా రోహిత్. ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అంతేకాదు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తానున్నానంటూ ముందుకు వస్తారు. అంతేకాదు తన పెదనాన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంటారు. అలాగే పెద్దమ్మ నారా భువనేశ్వరి జోలికి ఎవరైనా వస్తే వదిలిపెట్టరు. ఇక సోదరుడు నారా లోకేశ్ ఏ కార్యక్రమం చేసినా లక్ష్మణుడి మాదిరిగా వెన్నంటి నిలుస్తారు. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలందించిన చంద్రబాబు పట్ల జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అమానుషం అన్నారు. తన రాజకీయ జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేసిన చంద్రబాబును అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయించి చంద్రబాబును జైల్లో నిర్బంధించారని ఆరోపించారు. చంద్రబాబు జైలులో డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారని… తక్షణ వైద్యం అందించాలని వైద్యులు చెప్తున్నా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని చూస్తే వారి రాక్షస పోకడలు స్పష్టంగా ప్రజలకు అర్థమవుతున్నాయి అని మండిపడ్డారు.చంద్రబాబు ప్రజల సంపద… ఆయన్ను ప్రజలే రక్షించుకుంటారని చెప్పుకొచ్చారు. మహోన్నత స్థాయి కలిగిన వ్యక్తిని ఇబ్బందులకు గురి చేస్తే సమాజం క్షమించదన్న విషయం గుర్తుంచుకోవాలి అని సూచించారు. ఇప్పటికైనా కక్షలు, కార్పణ్యాలు వీడి మనుషుల్లా వ్యవహరించి చంద్రబాబుకు అవసరమైన వైద్యం అందించాలని ఓ ప్రకటనలో హీరో నారా రోహిత్ డిమాండ్ చేశారు.