సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ కు ఖేలో ఇండియా సెంటర్…
+ హర్షం వ్యక్తం చేసిన బాలూరి గోవర్ధన్ రెడ్డి
అన్ని క్రీడా వసతులు ఉన్న ఆదిలాబాద్ కు ఖేలో ఇండియా సెంటర్ రావడం అభినందనీయమని ఆదిలాబాద్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఖేలో ఇండియా సెంటర్ ద్వారా హాకీ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు హాకీ స్టిక్స్ లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇండియా ఫెడరేషన్ ఆఫ్ హాకీ కి అధ్యక్షుడిగా పని చేసారని అన్నారు. జిల్లా క్రీడాకారుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. క్రీడాకారులు మంచి ప్రతిభను కనబరిచి క్రీడల్లో రాణించి జిల్లాకు గుర్తింపు తేవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. హాకీ అంటే ఓ ఆటనే కాదని జీవితాన్ని మార్చే క్రీడా అని ఆయన పేర్కొన్నారు. ఎంతో మంది స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు సైతం పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, హాకీ కోచ్ శ్రీనివాస్, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు