సిరా న్యూస్ ఆదిలాబాద్:
గ్రామాల అభివృద్ధికి కేంద్రం పెద్దపీట…
+ ఎమ్మెల్యే పాయల్ శంకర్
+ భీంసరిలో రోడ్డు పనులకు భూమి పూజ
ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తూ, గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ రూరల్ మండలం భీంసరి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగంగా మంజూరైన సీసీ రోడ్డు పనులకు అధికారులు, నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టింది అన్నారు. కానీ గత రాష్ట్ర ప్రభుత్వం మంజూరైన నిధులను దారి మళ్లించి, గ్రామాల అభివృద్ధికి అడ్డుకట్ట వేసిందని విమర్శించారు. గ్రామాల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలన్నీ మూలనపడ్డాయనీ, కనీసం గ్రామపంచాయతీ కార్మికులకు కూడా జీతాలు ఇవ్వలేని దుస్థితికి గత ప్రభుత్వం పంచాయితీలను తీసుకొచ్చింది అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని ఆయన అన్నారు. తాను పార్టీలకతీతంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని, అధికారులు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.