Everyone’s focus is on Krishna’s birthplace : కృష్ణ జన్మభూమిపైనే అందరి దృష్టి

సిరా న్యూస్;

500 ఏళ్లుగా వివాదాలు, సవాళ్లు, న్యాయపరమైన చిక్కులు, సమస్యలు అన్నీ దాటుకుని వచ్చి అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తైంది. ఈ మధ్యే ప్రారంభోత్సవమూ జరిగింది. ఎన్నో ఏళ్లుగా తమ అజెండాలో ఉన్న ఈ హామీని నెరవేర్చుకుంది బీజేపీ. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ కల నెరవేరిందంటూ ఇప్పటికే బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. లోక్‌సభ ఎన్నికల ముందు ఆ పార్టీకి మంచి జోష్ ఇచ్చే పరిణామం ఇది. దీన్ని రాజకీయాలకు ముడి పెట్టొద్దు అని ఎంతగా చెప్పినప్పటికీ అది సాధ్య పడడం లేదు. కాంగ్రెస్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈ సమస్యను తమ ప్రభుత్వం పరిష్కరించిందని ఇటీవలే హోం మంత్రి అమిత్‌ షా కూడా లోక్‌సభలో స్పష్టం చేశారు. అయోధ్య కన్నా ముందు కాశీ విశ్వనాథుని ఆలయాన్ని పునరుద్ధరించడం వల్ల మోదీపై హిందువులకు ఎనలేని గౌరవం పెరిగింది. హిందూ ధర్మాన్ని నడిపించే వ్యక్తి అంటూ ప్రశంసలు పొందుతున్నారు. అయితే…ఎన్నో న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొని అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని చేపట్టిన మోదీ సర్కార్‌…అప్పుడే మరో లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అదే మధుర ఆలయ నిర్మాణం. శ్రీకృష్ణ జన్మభూమిలో ఔరంగజేబు మసీదు కట్టించారని హిందువులు ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. రామ జన్మభూమి వివాదం కొలిక్కి రావడం వల్ల ఇప్పుడు కృష్ణ జన్మభూమిపైనే అందరి దృష్టి నెలకొంది. దీనికి తోడు ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్..శ్రీకృష్ణ జన్మభూమిలో ఆలయం కట్టాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. అంటే…తమ అజెండాలో అది కూడా ఉందని హింట్ ఇచ్చారు. అయితే…కృష్ణ జన్మభూమి విషయంలోనూ ఎన్నో న్యాయపరమైన సవాళ్లని దాటుకోవాల్సి ఉంటుంది. యమునా నదీ తీరంలోని మధురలోనే శ్రీకృష్ణుడు జన్మించాడనేది హిందువుల బలమైన విశ్వాసం. ఇక్కడ ఒకటో శతాబ్దంలో విష్ణు ఆలయం నిర్మించారని చరిత్రకారుడు ఎంట్‌విసిల్‌ వెల్లడించాడు. రెండో చంద్రగుప్తుడు..అంటే విక్రమాదిత్యుడి కాలంలో ఇక్కడ మరో భారీ ఆలయం నిర్మించారని చెప్పాడు. ఇక్కడ పురావస్తు తవ్వకాల్లో మరి కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విష్ణు ఆలయాని కన్నా ముందు ఇక్కడ బౌద్ధ ఆనవాళ్లు కనిపించాయి. బౌద్ద నిర్మాణాలను ధ్వంసం చేసి ఇక్కడ విష్ణు ఆలయం నిర్మించారని ప్రముఖ ఆర్కియాలజిస్ట్ అలెగ్జాండర్ స్పష్టం చేశాడు. బౌద్ధ నిర్మాణాలకు ఉపయోగించిన రాతితోనే ఇక్కడ ఆలయాన్ని నిర్మించారనీ చెప్పాడు. ఇక్కడ హిందువుల ఆలయాలతో పాటు బౌద్ధులు, జైనుల నిర్మాణాలూ ఉన్నట్టు చరిత్రకారులు చెబుతున్నారు. అప్పట్లో ఇక్కడ బౌద్ధమతమే విస్తృతంగా ప్రచారంలో ఉండేదన్నది కొందరి విశ్లేషణ. అయితే..11వ శతాబ్దం నుంచి భారత్‌లో ముస్లిం పాలకుల ఆక్రమణలు మొదలయ్యాయి. ఆ సమయంలోనే ఆలయాలపై దాడులు జరిగాయి. గజనీ మధురలోని ఆలయంపై దాడి చేసినట్టు చరిత్ర చెబుతోంది. 1150 సంవత్సరానికి చెందిన ఓ సంస్కృత శాసనం ఇక్కడ విష్ణు ఆలయం ఉందని చెబుతోంది. ఇప్పుడదే స్థానంలో కేశవ్ దేవ్ ఆలయముంది. ఇక్కడి విష్ణు ఆలయం మేఘాల్ని తాకుతుందా అన్న ఎత్తుగా పాలరాతితో ధగధగా మెరిసిపోయేదని ఆ శాసనంలో రాసుంది. అయితే…వరస దాడులు జరగడం వల్ల రూపు రేఖలు లేకుండా పోయాయి. ఢిల్లీ సుల్తానుల దాడులతో ధ్వంసమైంది. 1556-1605 మధ్య కాలంలో అక్బర్ పాలనలో పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. అక్బర్ మూడు సార్లు మధురని సందర్శించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. 1618లో అక్బర్ కొడుకు జహంగీర్ మధురలోని కత్రాలో ఆలయాన్ని నిర్మించాడు. 1659 లో ఔరంగజేబు వచ్చిన తరవాతే అసలు పతనం మొదలైంది. 1660లో అబ్దుల్ నబీ ఖాన్‌ని మధురకి గవర్నర్‌గా నియమించాడు ఔరంగజేబు. మధురలో అంతకు ముందు ఉన్న ఆలయాన్ని పడగొట్టి జామా మసీద్‌ని నిర్మించాడు. 1669లో ఔరంగజేబు సంచలన ఆదేశాలిచ్చాడు. మొఘల్ హయాంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో హిందూ నిర్మాణాల్ని ధ్వంసం చేయాలని తేల్చి చెప్పాడు. ఆ క్రమంలోనే 1670లో మధురలోని కేశవ్‌దేవ్ ఆలయాన్ని ధ్వంసం చేశారు. అక్కడే షాహీ ఈద్గా నిర్మించారు. అప్పటి వరకూ ఆలయంలో పని చేసిన పూజారులను ఆగ్రాకి తీసుకెళ్లి అక్కడే సజీవ సమాధి చేసినట్టు కొందరు చెబుతారు. ఈ ఈద్గా గురించే ఇప్పుడు వివాదమంతా నడుస్తోంది. కేశవ్‌దేవ్ ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు కట్టారని, అదే కృష్ణ జన్మభూమి అని హిందువులు వాదిస్తున్నారు. శ్రీకృష్ణుడు జన్మించిన స్థలానికి సమీపంలోనే ఉన్న కత్రా కేశవ్ దేవ్ ఆలయాన్ని ధ్వంసం చేసి 13.37 ఎకరాల భూమిలో ఈద్గా నిర్మించారన్నది హిందువుల వాదన. 1803లో మధుర బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిధిలోకి వెళ్లిపోయింది. 1815లో ఈ భూమిని ఈస్ట్ ఇండియా కంపెనీ వేలం వేసింది. అప్పట్లో రాజా పత్నిమల్ ఓ బ్యాంకర్ ఈ భూమిని కొనుగోలు చేశాడు. ఆ తరవాత 1944లో పత్నిమల్ వారసులు ఈ భూమిని ఇండస్ట్రియలిస్ట్ జుగల్ కిశోర్ బిర్లాకి విక్రయించాయి. 1951లో బిర్లా శ్రీ జన్మ భూమి ట్రస్ట్ ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఆలయాన్ని నిర్మించేందుకు నిధులు సేకరించాడు. 1983 నాటికి ఆలయాన్ని పూర్తి చేశాడు. ఇప్పుడు ఈద్గా షాహి మసీదు పక్కనే ఉన్న ఆలయం ఇదే. 2020లో తొలిసారి ఈ స్థల వివాదంమొదలైంది. ఆ ఏడాది సెప్టెంబర్‌లో లక్నో వాసి, అడ్వకేట్ రంజన అగ్నిహోత్రితో పాటు మరో ఆరుగురు న్యాయ పోరాటం మొదలు పెట్టారు. కేశవ్ దేవ్ ఆలయ కాంప్లెక్స్‌లో ఉన్న మసీదుని వెంటనే తొలగించాలని పిటిషన్ వేశారు. అది కృష్ణ జన్మభూమిలో భాగమే అని వాదించారు. అయితే…ఈ పిటిషన్‌ని కోర్టు కొట్టేసింది. ఆ తరవాత ఈ వివాదం జిల్లా కోర్టుకి చేరుకుంది. ఆ తరవాత ఈ న్యాయ పోరాటం కొనసాగింది. అయితే..గతేడాది డిసెంబర్ 14వ తేదీన అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇక్కడ ASI సర్వే జరిపేందుకు అనుమతినిచ్చింది. ఇక్కడ మసీదు ఆనవాళ్లను తొలగించి ఆ భూమిని పూర్తిగా ట్రస్ట్కి అప్పగించాలని పిటిషనర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే…సమాచార హక్కు చట్టంలో భాగంగా అడిగిన ఓ ప్రశ్నకు ఆర్కియాలజీ ఆసక్తికర సమాధానమిచ్చింది. ఔరంగజేబు ఇక్కడి ఆలయాన్ని ధ్వంసం చేశాడని తేల్చి చెప్పింది. ఇక్కడ హిందూ ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లున్నాయని స్పష్టం చేసింది. 1920 నాటి గెజిట్‌లో ఇదే విషయం ఉన్నట్టు పేర్కొంది. జ్ఞానవాపి మసీదు కేసులో హిందువుల తరపు పోరాడిన అడ్వకేట్ విష్ణుశంకర్ జైన్..ఈ కేసు బాధ్యతలూ తీసున్నారు. జ్ఞానవాపి మసీదులో ఎలా అయితే ASI సర్వే జరిగిందో అదే తరహాలో ఈద్గా షాహిలోనూ జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సర్వే నివేదిక ఇచ్చిన తరవాతే ఏం చేయాలనుకున్నా. అయితే…అయోధ్య రామజన్మ భూమి వివాదాన్ని ఎలా అయితే సామరస్యంగా పరిష్కరించుకున్నారో…ఈ కేసునీ అంతే సానుకూలంగా పరిష్కరించుకుంటుందన్న విశ్వాసం వ్యక్తమవుతోంది. దీనిపై యూపీ సర్కార్‌ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. అన్ని సవాళ్లూ దాటుకుని రామ జన్మభూమి తరహాలో కృష్ణ జన్మభూమినిఅభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *