హైదరాబాద్, (సిరా న్యూస్);
ఎప్పటిలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో ప్రవాస భారతీయులు పోటీ చేస్తున్నారు. మాతృభూమికి దూరంగా విదేశాల్లో ఉన్నా పుట్టిన గడ్డ కోసం పలు సేవాకార్యక్రమాలు చేస్తూ ఇక్కడి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించిన కొందరు ప్రవాస భారతీయులు ఈ సారి ఎన్నికల్లో నిలిచారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రవాస భారతీయుల పోరు ఆసక్తికరంగా మారింది. తమ సొంత డబ్బుతో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో స్వస్థలాల్లో సేవాకార్యక్రమాలు చేసిన పలువురు అభ్యర్థులు ఈ సారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.వరంగల్ పూర్వ జిల్లా పాలకుర్తికి చెందిన ఝాన్సీరెడ్డి అమెరికా దేశంలో స్థిరపడ్డారు. పాలకుర్తికి చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో సన్నిహిత సంబంధాలున్న ఝాన్సీరెడ్డి ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల అమెరికా దేశ పర్యటన సందర్భంగా ఝాన్సీరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఝాన్సీరెడ్డిని ఎన్నికల్లో పోటీ చేయించాలని అనుకున్నా, అమెరికా పౌరసత్వ సమస్య రావడంతో ఆమె బదులు కోడలైన యశస్వినిరెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా పాలకుర్తి బరిలోకి దించారు.పాలకుర్తి నుంచి పోటీ చేస్తున్న యశస్వినిరెడ్డి హైదరాబాద్ నగరంలో బీటెక్ చదివి, పెళ్లి అనంతరం ఝాన్సీరెడ్డి కోడలిగా అమెరికా వెళ్లారు. పాలకుర్తిలో పలు సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న ఝాన్సీరెడ్డి తన కోడలిని పోటీలోకి దించారు. అత్యంత పిన్న వయస్కురాలైన యశస్వినిరెడ్డిని గెలిపించాలని కోరుతూ ఇటీవల రేవంత్ రెడ్డి సైతం పాలకుర్తిలో ప్రచారం చేశారు.