కరీంనగర్, (సిరా న్యూస్);
మంథనిలో బిగ్ ఫైట్ కొనసాగుతుంది. అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే నెలకొంది. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ క్లీన్ స్పీస్ చేసినా.. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు ఓటర్లు. మరోసారి బరిలోకి దిగుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. ఇప్పటికే, పోటా పోటీ ప్రచారంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సందిట్టో సడేమియాలా భారతీయ జనతా పార్టీ కూడా వేగంగా పుంజుకుంటుంది.పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో హోరా హోరీ ప్రచారం సాగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ నుంచి పుట్ట మధు, బీజేపీ నుంచి సునీల్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ జయం సాధిస్తే, మంథనిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ తరుఫున శ్రీధర్ బాబు ఒకరే విజయ కేతనం ఎగురవేశారు. మరోసారి రెండు పార్టీల నుంచి గతంలో పోటీ చేసిన ఇద్దరు నేతలు బరిలోకి దిగుతున్నారు.ఇప్పటికే మూడు పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మంథనిలో అభివృద్ధి జరగకుండా, ప్రభుత్వం అడ్డుకుందని శ్రీధరబాబు విమర్శలు చేస్తున్నారు.