ఆర్కే యూ టర్న్ వెనుక…

సిరా న్యూస్,గుంటూరు;
ఏపీ రాజకీయాల్లో భారీ కుదుపు. ఆళ్ల రామకృష్ణారెడ్డి యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలోకి జంప్ అయ్యారు. కొద్దిరోజులు కిందట షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. మంగళగిరి నియోజకవర్గంలో వైసిపి ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదని హాట్ కామెంట్స్ చేశారు. జగన్ ను నమ్మి మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. చివరివరకు షర్మిల వెంట నడుస్తానని స్పష్టం చేశారు.కానీ కాంగ్రెస్ లో చేరిన నెల రోజులకే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు తిరిగి వైసీపీలో చేరారు.2014 నుంచి మంగళగిరి నియోజకవర్గానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ జగన్ అనూహ్యంగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని మార్చారు. బీసీ అభ్యర్థి గంజి చిరంజీవిని తెరపైకి తెచ్చారు. తొలి జాబితాలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి పై వేటు వేశారు. అంతకుముందు టిడిపి ప్రభుత్వం వైఫల్యాలపై న్యాయ పోరాటం చేయడంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ముందుండే వారు. జగన్ కు నమ్మకస్తులైన ఎమ్మెల్యేల్లో ఆయన ముందు వరుసలో ఉండేవారు. అటువంటి తనకే టికెట్ కేటాయించకపోవడంతో మనస్థాపానికి గురయ్యారు. సొంత నిధులు ఖర్చు చేసి మంగళగిరిని అభివృద్ధి చేశానని బాధపడ్డారు. అదే సమయంలో షర్మిల కాంగ్రెస్ పగ్గాలు తీసుకోవడంతో ఆమె వెంట నడవాలని నిర్ణయించుకున్నారు. అయితే మంగళగిరి నియోజకవర్గంలో మారిన రాజకీయ పరిణామాలతో రామకృష్ణారెడ్డి మనసు మార్చుకోవడం విశేషం.కాంగ్రెస్ లోకి వెళ్లిన ఆళ్ల రామకృష్ణారెడ్డి పై వైసీపీ పెద్దలు ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.నిన్న విజయసాయిరెడ్డి నేరుగా ఆళ్లతో చర్చలు జరిపారు.మరోవైపు మంగళగిరి నుంచి అభ్యర్థిగా ప్రకటించిన గంజి చిరంజీవి సర్వేల్లో వెనుకబడ్డారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఎమ్మెల్సీ హనుమంతరావు వ్యతిరేకిస్తున్నారు. దీంతో జగన్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఆళ్ల రామకృష్ణారెడ్డికి వెనక్కి రప్పించి టికెట్ కేటాయించడానికి విజయసాయిరెడ్డిని ప్రయోగించినట్లు సమాచారం.ఈ చర్చలు సానుకూలంగా జరగడంతో ఈరోజు మధ్యాహ్నం సీఎం జగన్ తో ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. నేరుగా వైసీపీలో చేరారు.వైసిపి తనకు అన్ని విధాలుగా అండగా నిలిచిందని..రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన పార్టీ అని ఆర్కే చెప్పుకొచ్చారు.వైసిపి అంటే తనకు వల్ల మానిన అభిమానమని.. అందుకే పార్టీలోకి తిరిగి వచ్చినట్టు చెప్పారు. మంగళగిరి టిక్కెట్ విషయం అధిష్టానం చూసుకుంటుందని.. ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గెలుపు కోసం తనవంతు సహకారం ఉంటుందని చెప్పుకొచ్చారు. మంగళగిరిలో లోకేష్ ఓటమి మరోసారి ఖాయమని తేల్చి చెప్పారు. అయితే తన టిక్కెట్ విషయం మాత్రం ఎక్కడా బయట పెట్టలేదు. మొత్తానికైతే నెలరోజుల వ్యవధిలోనే ఆర్కే యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై వైఎస్ షర్మిల ఎలా స్పందిస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *