Medaram Fair…what day is it? మేడారం జాతర…ఏ రోజు ఏంటీ

సిరా న్యూస్,వరంగల్;
ములుగు జిల్లా ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలంలో కొలువుదీరిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు భక్తులు పోటెతారు. భారీగా బంగారం (బెల్లం), చీరె-సారే, పూలు, పండ్లు, గాజులు, పసుపు-కుంకుమలతో, ముడుపులు కట్టి మొక్కులు సమర్పించుకుంటున్నారు.
జాతర మొదటి రోజు – ఫిబ్రవరి 21 బుధవారం
కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో మేడారంలో మహాజాతర ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. ములుగు జిల్లా మేడారానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలోని చిన్న ఆలయంలో ప్రతిష్టించిన సారలమ్మను జాతరలో మొదటి రోజు బుథవారం సాయంత్రం మేడారంలోని గద్దె వద్దకు చేర్చారు. మధ్యాహ్నమే కన్నెపల్లికి చేరుకున్న వడ్డెలు రెండు గంటల పాటు పూజలు చేశారు. పిల్లలు లేనివారు, దీర్ఘకాలిక రుగ్మతలతో భాదపడేవారు పుణ్యస్నానాలు ఆచరించి తడిబట్టలతో గుడిబయట పొర్లు దండాలు పెట్టారు. దేవతా రూపాన్ని తీసుకొచ్చే పూజారులు..పొర్లు దండాలు పెడుతున్న వారిపైనుంచి నడిచి వెళ్లారు.. అమ్మవారే స్వయంగా తమపై నడిచి వెళుతోందని భక్తులు భావిస్తారు. కన్నెపల్లి గ్రామ ఆడపడుచులు హారతులు ఇచ్చి అమ్మవారిని మేడారానికి సాగనంపుతారు. సారలమ్మ గద్దె పైకి రాకముందే ఏటూర్‌నాగారం మండలంలోని కొండాయి నుండి గోవిందరాజులను, కొత్తగూడ మండలంలోని పూనుగోండ్ల నుంచి పగిడిద్ద రాజును అటవీ మార్గం మీదుగా కాలినడకన మేడారానికి తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టించారు. సారలమ్మ సహా వీరిని తీసుకువచ్చే ముగ్గురు వడ్డెలు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం వారి వారి గద్దెలపై ప్రతిష్టింపజేయడంతో మొదటి రోజు మహా ఘట్టం పూర్తయింది
జాతరలో రెండో రోజు -ఫిబ్రవరి 22 గురువారం
మహాజారతలో రెండోరోజు ఫిబ్రవరి 22న సమ్మక్క తల్లి సాయంత్రం గద్దెపైకి వస్తుంది. గురువారం ఉదయం ఆరు గంటల నుంచే పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. మొదటగా గిరిజన పూజారులు మేడారం సమీపంలోని చిలుకల గుట్టకు వెళ్ళి వెదురు కర్రలు తీసుకొచ్చి గద్దెలపై పెట్టి పూజిస్తారు. ఆ తర్వాత సమ్మక్క పూజా మందిరం నుంచి పసిడి కుండలను తెచ్చి గద్దెలపై నెలకొల్పుతారు. తర్వాత మళ్ళీ చిలుకల గుట్టకు వెళ్తారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సమ్మక్కను గద్దెపైకి తీసుకువచ్చే మహాఘట్టం మొదలవుతుంది. తల్లి రూపాన్ని చేతపట్టుకున్న మరుక్షణమే ప్రధాన వడ్డె తన్మయత్వంతో పరుగు పరుగున గుట్ట దిగుతాడు. జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతకు ఆహ్వానం పలుకుతారు. సమ్మక్క రాకతో మేడారం మొత్తం శివసత్తుల పూనకాలతో హోరెత్తి ఊగిపోతుంది. దారి పొడవునా భక్తుల జన ప్రవాహం సాగుతుంది..అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా జంతు బలులు ప్రారంభమవుతాయి. కుంకుమ భరణిని గద్దెలపైకి చేర్చిన తర్వాత మహా జాతర లాంఛనంగా ప్రారంభమవుతుంది.
మూడో రోజు – ఫిబ్రవరి 23 శుక్రవారం
గద్దెలపైకి సమ్మక్క-సారమ్మ వనదేవతలు ఆసీనులైన మూడో రోజు భక్తులు పోటెత్తుతారు. ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అమ్మవార్లను దర్శించుకుంటారు. కానుకలు చెల్లిస్తారు. వన దేవతలను ఆడపడుచులుగా భావిస్తూ పసుపు, కుంకుమలు, చీరె, సారె, పెడతారు. ఒడిబియ్యం పోస్తారు. తలనీలాలు సమర్పించుకుంటారు. ఎత్తు బంగారం నైవేద్యాలుగా పెడతారు.
జాతరలో నాలుగో రోజు – ఫిబ్రవరి 24 శనివారం
మేడారం మహాజాతరలో నాలుగోరోజు సమ్మక్కను చిలుకల గుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవింద రాజును కొండాయికి, పగిడిద్ద రాజును పూనుగొండ్లకు కాలనడకన తీసుకెళ్తారు. ఇలా దేవతలు వన ప్రవేశం చేయడంతో మహాజాతర ముగుస్తుంది. సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల సమయంలో ఈ క్రతువు ముగుస్తుంది. సమ్మక్క చిలుకల గుట్టపైకి, సారలమ్మ కన్నెపెల్లికి తరలివెళ్ళిన తర్వాత భక్తులు తిరుగు పయనమవుతారు. మళ్ళీ రెండేళ్ళపాటు భక్తులు తల్లుల రాక కోసం వేచి చూస్తుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *