వణుకు పుట్టిస్తున్న నయా బాస్
సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో అవినీతి అధికారుల భరతం పడుతున్నారు ఏసీబీ అధికారులు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న పలువురు అధికారులను ఏసీబీ అధికారులు అరెస్టు చేస్తోంది. చిన్న పనులకు సైతం లక్షల్లో లంచం డిమాండ్ చేస్తూ, ప్రజల కష్టార్జితాన్ని పిలిచి పిప్పి చేస్తున్నారు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు. అలాంటి అవినీతి అనకొండలపై ఏసీబీ కొరడా ఝలిపిస్తోంది.ఒక బాలకృష్ణ, ఒక జ్యోతి, ఒక సత్యనారాయణ, ఒక లచ్చు నాయక్.. వీరంతా ప్రభుత్వంలో పని చేస్తున్న ఉన్నతాధికారులు. ప్రజలకు అందించాల్సిన సేవలను నిర్వర్తించడం వీరి కర్తవ్యం. కానీ వీరు తమ కర్తవ్యాన్ని అడ్డం పెట్టుకుని సొంత అక్రమ ఆర్ధిక సంపాదనను అంతకింతకు పెంచుకుంటూ పోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు ప్రజల కష్టార్జితాన్ని పీల్చి పిప్పి చేసి, చిన్న పనులకు సైతం లక్షల రూపాయల లంచాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి శాఖలోనూ అవినీతి అనకొండలు ఉన్నారు. వీరి భరతం పట్టేందుకు ఏసీబీ అధికారులు సైతం సిద్ధంగా ఉన్నారు. ఇటీవల కాలంలో ప్రజల నుండి లంచం డిమాండ్ చేస్తున్న పలువురు అధికారులను ఏసీబీ అరెస్టు చేసింది.ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జ్యోతిని ఏసీబీ అధికారులు ఫిబ్రవరి 19న అరెస్టు చేశారు. మాసబ్ ట్యాంక్ లో ఉన్న తన కార్యాలయంలో ఒక బాధితుడు నుండి 84 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా ఆమెను పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని గాజుల రామారంలో జువైనల్ బాయ్స్ హాస్టల్ నిర్మాణం కోసం నిధులు మంజూరు అయ్యాయి. అయితే ఆ సాంక్షన్ బిల్లులపై సంతకం చేసేందుకు ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జ్యోతి 84 వేల రూపాయలు డిమాండ్ చేసింది. దీంతో బాధితులు గంగన్న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.బాధితుడి ఫిర్యాదు మేరకు ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. సోదాల అనంతరం బాధితుడు దగ్గర నుండి 84 వేల రూపాయలు తీసుకున్నందుకు ఆధారాలు రుజువు కావటంతో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జ్యోతిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం జ్యోతి నివాసంలోను ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మెహదీపట్నంలో ఉన్న జ్యోతి నివాసంలో ఎస్సీబీ అధికారులు భారీగా అక్రమ సంపాదన గుర్తించినట్టు సమాచారం. జ్యోతి ఇంట్లో ఎక్కడపడితే అక్కడ నగదు, బంగారం లభించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. జ్యోతి ఇంట్లో సోదాల సమయంలో 65 లక్షల రూపాయల నగదుతో పాటు నాలుగు కిలోల బంగారు అభరనాలు దొరికాయి. దీంతో జ్యోతి పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మరోవైపు సోదాల సమయంలో జ్యోతికి అనారోగ్య సమస్యల తలెత్తడంతో, ఆమెను ఉస్మానియా హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఆమె పూర్తిగా కోరుకున్న తర్వాత నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో జ్యోతిని అధికారులు హాజరు పరిచనున్నారు.ఇక అవినీతి తిమింగలం హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ గురించి పుట్టలుగా కథలు బయటపడ్డాయి. ఆయన అక్రమ సంపదలను కొలిచేందుకు 20 రోజులుగా ఏసీబీ దర్యాప్తు చేస్తూనే ఉంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా పనిచేయడంతో పాటు రేరా సెక్రటరీగాను శివ బాలకృష్ణ పని చేసిన హయాంలో ఇష్టానుసారంగా అనుమతులు, బిల్డింగ్ లేఔట్ పర్మిషన్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సంబంధాలు, ఇలా ఒకటేమిటి అనేక అంశాల్లో శివ బాలకృష్ణ వేలు పెట్టాడు. అందిన కాడికి పుచ్చుకోవడం దొరికినంత దోచుకోడం శివ బాలకృష్ణ వ్యవహరించినట్టు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివ బాలకృష్ణ తో పాటు అతని సోదరుడు శివ నవీన్ కుమార్ ను సైతం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.అవినీతి అనకొండలుగా ఉన్న అధికారులు తమ పేరు మీదే కాకుండా తమ కుటుంబ సభ్యుల పేరు మీద బినామీ ఆస్తులను కూడా పెట్టి అక్రమ సంపాదనకు అధిపతులుగా మారుతున్నారు. ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉంటే చాలు మిగతా వారందరినీ ఎలాగోలా సెటిల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చాలా మంది ఉంటారు. ఈ విషయంలో శివ బాలకృష్ణ మరో అడుగు ముందుకు వేసి తన కుటుంబ సభ్యులందరినీ సెటిల్ చేసేశాడు. భార్య కూతురు కొడుకు తమ్ముడు తమ్ముడు భార్య పేరు మీద భూములు రిజిస్టర్ చేయించాడు. జనగాం, మెదక్, యాదాద్రి భువనగిరి ప్రాంతాల్లో శివ బాలకృష్ణ బినామీలకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. అయితే శివ బాలకృష్ణ వెనుక ఉన్న పెద్దల గురించి ఏసీబీ త్వరలోనే దర్యాప్తు చేయనున్నట్టు సమాచారం.ఇక మరో అవినీతి అనకొండను ఏసీబీ అధికారులు కొద్దిరోజుల క్రితం అరెస్ట్ చేశారు. షామీర్‌పేట్ తాసిల్దార్‌గా పనిచేసిన సత్యనారాయణ ట్రాప్ కేసులో ఏసీబీ అరెస్టు చేసింది. ఒక భూమికి సంబంధించిన పట్టా పాస్ బుక్ ఇచ్చేందుకు షామీర్‌పేట్ తాసిల్దార్ సత్యనారాయణ 30 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. ఇరిగేషన్ లో ఉన్న ఒక భూమికి క్లియరెన్స్ ఇచ్చి పాస్ బుక్కులు మంజూరు చేసేందుకు 30 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. అందులో 10 లక్షల రూపాయలను తాసిల్దార్ సత్యనారాయణకు ఇచ్చాడు బాధితుడు. అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో శామీర్‌పేట్ తాసిల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ వ్యవహారంలో షామీర్‌పేట్ తహసిల్దార్ సత్యనారాయణతో పాటు అతని డ్రైవర్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.నల్గొండ జిల్లాకు చెందిన ప్రభుత్వం జనరల్ ఆసుపత్రి సూపరిండెంట్ లచ్చు నాయక్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరిండెంట్ కావటంతో వివిధ సర్జికల్ టెండర్లకు సంబంధించిన అనుమతులు సూపరిడెంట్ చేతిలో ఉంటాయి. అయితే సర్జికల్ ఐటమ్స్‌ను నాన్ టెండర్ విభాగంలో మంజూరు చేసేందుకు బాధితుడు దగ్గర నుండి 3 లక్షల రూపాయల డిమాండ్ చేశాడు సూపరిండెంట్ లచ్చు నాయక్. దీంతో బాధితుడు అధికారులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించిన తర్వాత నల్గొండ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ సూపరిండెంట్ లచ్చు నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఇలా అవినీతి అక్రమార్కుల భరతం పడుతున్నారు ఏసీబీ అధికారులు. గత కొన్ని నెలల వరకు కేవలం ట్రాప్ కేసులపై మాత్రమే దృష్టి సారించింది. ఏసీబీ ఐజీగా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టిన అనంతరం అధికారులు మరింత దూకుడు పెంచారు. ఆదాయానికి నుంచి ఆస్తులు కూడపెట్టుకున్న అధికారుల కేసులను ఏసీబీ ఫోకస్ చేసింది. రానున్న రోజుల్లో మరి కొంతమంది అధికారులపైన ఏసీబీ కొరడా ఝలిపించనున్నట్లు సమాచారం