సిరా న్యూస్, భీమదేవరపల్లి:
ముందుకు సాగని మల్లారం-మైసంపల్లి బీటీ రోడ్డు పనులు
+ నిధులున్న ఉపయోగం ‘సున్నా’
+ గత ప్రభుత్వ హయాంలో 6.6 కోట్ల నిధులు మంజూరు
+ ప్రభుత్వం మారడంతో పడకేసిన రోడ్డు పనులు
+ పట్టించుకోని అధికారులు, పాలకులు
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని మల్లారం-మైసంపల్లి బీటీ రోడ్డు పనులు ముందుకు సాగడం లేదు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 3 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న ఈ రోడ్డు కోసం 6.6 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అప్పట్లో ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఈ రోడ్డు పనులకు భూమి పూజ చేసి శంకుస్థాపన గావించారు. అటు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రోడ్డు పనులను పట్టించుకునే వారే కరువయ్యారు.
3 కిలోమీటర్లకు… 30 నిమిషాలు…
మండలంలోని మల్లారం, మైసంపల్లి గ్రామాలను కలుపుతూ విస్తరించి ఉన్న ఈ రోడ్డు పరిస్థితి ప్రస్తుతం అధ్వానంగా మారింది. అడుగడుగున గుంతలతో నిండిపోయి ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. వర్షాకాలంలో అయితే ఈ రోడ్డు గుండా నడవలేని పరిస్థితి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం మూడు కిలోమీటర్ల ప్రయాణానికి 30 నిమిషాలు పడుతుందని చెబుతున్నారు. కాగా ఇటీవలే స్థానిక గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ను గ్రామస్తులు రోడ్డు పనుల గురించి అడగగా, సమాధానం దాటవేసినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో అసలు ఈ రోడ్డు పనులు ప్రారంభమవుతాయా? లేదా? అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పాలకులు పట్టించుకోని బీటీ రోడ్డు పనులను ప్రారంభించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
———————————————————-
గుంతల రోడ్డుతో అవస్థలు పడుతున్నాం…
రోడ్డు పనులు ప్రారంభం కాకపోవడంతో గుంతల రోడ్డుతో అవస్థలు పడుతున్నాము. రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉంది. అడుగడుగున గుంతలు ఉండడంతో 3 కిలోమీటర్ల ప్రయాణానికి 30 నిమిషాలు వెచ్చించాల్సి వస్తుంది. గతంలో రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరైనట్లు తెలిసింది. అధికారులు వెంటనే పనులు ప్రారంభించి, బీటి రోడ్డు నిర్మించాలి.
-తిరుపతి, మైసంపల్లి
———————————————————-
అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు…
మట్టి రోడ్డు కావడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉంది. వర్షాకాలంలో అయితే ఈ రోడ్డు గుండా అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు. అత్యవసర సమయాల్లో ఈ రోడ్డు గుండా ప్రయాణం చేయాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఇకనైనా అధికారులు పట్టించుకోని కొత్త బీటీ రోడ్డు నిర్మించాలి.
-ప్రశాంత్ కుమార్, మైసంపల్లి
———————————————————-