సిరాన్యూస్, ఆదిలాబాద్
టైంపాస్ టూర్ మోడీ పర్యటన
* ఆశలపై నీళ్లు చల్లిన మోడీ
* రానున్న ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలి
* డీసీసీబి ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి
దేశ ప్రధాని మోదీ ఆదిలాబాద్ పర్యటన ఒక టైంపాస్ టూర్ గా కాంగ్రెస్ నాయకులు డీసీసీబి ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి అభివర్ణించారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్‌లో ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడారు. గిరిజన యూనివర్సిటీ , టెక్స్ టైల్ పార్క్ , విమానాశ్రయం, సీసీఐ, ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ లాంటి దీర్ఘకాలిక డిమాండ్లపై మోదీ ఒక హామీ అయినా ఇవ్వకుండా కేవలం రాజకీయంగా విమర్శలు చేసి వెళ్లిపోయారని ఆయన మండిపడ్డారు. కేవలం ఎన్నికల కోసమే వచ్చారని, ప్రజలను మరోసారి మభ్యపెట్టారని ఆరోపించారు. మూడు నెలల్లో ముఫ్పై వేల ఉద్యోగాలిచ్చిన తమ కాంగ్రెస్ ప్రభుత్వం పైవిమర్శలు తగవన్నారు. గత బీఆర్ ఎస్ ప్రభుత్వం తో కాంగ్రెస్ ను పోల్చడాన్ని తప్పుబట్టారు.ఆదిలాబాద్ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నప్రధాని మోడీ బీజేపీ విజయ సంకల్ప సభ ఉత్తుత్తి సభ అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావించారని అన్నారు. కానీ ఆశలపై నీళ్లు చల్లుతూ ఆయన పర్యటన సాగిందన్నారు. సభలో ఏ ఒక్క హామీనిగానీ, ఏ ఒక్క డిమాండ్ గానీ ప్రస్తావించలేదన్నారు. కేవలం రాజకీయంగా విమర్శలు చేశారంటూ మండిపడ్డారు. బీజేపీ వైఖరి ఏమిటో ప్రజలకు అర్థమైపోయిందని, రాబోయే ఎన్నికల్లో తగినరీతిలో బుద్ధిచెబుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ దిగంబర్‌రావు పటేల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నగేష్, సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్‌రావు, మాజీ ఎంపీపీ మంచికట్ల ఆశమ్మ, నాయకులు ఎంఏ.షకిల్, రఫిక్, యాల్ల పోతా రెడ్డి, బాయిన్‌వార్ గంగారెడ్డి, రాజ్ మహమ్మద్, బూర్ల శంకరయ్య, కోరేటి కిషన్, రమణ, తలా చౌష్, మహిళా నాయకురాలు లత, సోనియా, మంథని, తదితరులు పాల్గొన్నారు.