నిజామాబాద్,(సిరా న్యూస్);
రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ పార్టీ వెంటబడి మరీ నిలిపివేయించిందని, రైతుల నోటి కాడి బుక్కను లాక్కొని ఆ పార్టీ రైతు వ్యతిరేకతను చాటుకుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు నిప్పులు చెరిగారు. రైతు బంధు ఇప్పటికే అమల్లో ఉన్న పథకమని, 10 సార్లు రైతు బంధ పథకం కింద రైతుల ఖాతాలో ప్రభుత్వం డబ్బు జమా చేసిందని గుర్తు చేశారు. అది ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టకున్నా ప్రవేశపెట్టిన పథకం అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటబడి రైతు బంధు పథకాన్ని ఆపించారని మండిపడ్డారు. ఈ పథకం కింద 65 లక్షల మంది రైతులకు రూ. 72 వేల కోట్ల మేర నిధులను ఇచ్చామని, దాంతో రైతులు బీఆర్ఎస్ వైపు ఉన్నారన్న అభద్రతతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు వ్యతిరేకతను చాటుకున్నారని, రైతుల నోటికాడి బుక్కను గుంజుకున్నారని నిప్పులు చెరిగారు. రైతురుణ మాఫీని ఆపిందని, రైతు వ్యతిరేక వైఖరిని కాంగ్రెస్ పార్టీ మరోసారి రుజువు చేసుకుందని స్పష్టం చేశారు. నోటికాడి బుక్కను గుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీని గుర్తుకు తెచ్చుకొని ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసి తగిన బుద్దిచెప్పాలని రైతులకు పిలుపునిచ్చారు.
నిజామాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కవిత గారు మాట్లాడారు.దాదాపు 25 వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చామని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకున్నామని ప్రస్తావించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయానికి కూడా వ్యతిరేకమని ప్రకటించారు. 10 లక్షల ఉద్యోగాల భర్తీపై బీజేపీని యువత ప్రశ్నించాలి. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనన్ని ప్రభుత్వ ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందని, 2.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని తెలియజేశారు. కానీ కేంద్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలకు బీజేపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం లేదని ఎండగట్టారు. ఒక్క రైల్వే శాఖలోనే 3.3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, రక్షణ శాఖలో 3.5 లక్షలు, పోస్టల్ శాఖలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన, వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదని బీజేపీ నాయకులను యువత ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాలు భర్తీ చేస్తే అందులో తెలంగాణ వాళ్లకు కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. నిజామాబాద్ ను అద్భుతంగా అభివృద్ధి చేశాం.. నిజామాబాద్ లో ఉన్నమా లేదా హైదరాబాద్ లో ఉన్నామా అనుకునేంత స్థాయిలో నిజామాబాద్ ను అభివృద్ధి చేశామని వివరించారు.