బల్క్ ఎస్ఎంఎస్ లపై నిషేధం

హైదరాబాద్, (సిరా న్యూస్);
ఈనెల 30న జరగనున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో యాప్పటికే అభ్యర్థులు ప్రచార పర్వంలో తుది ఘట్టాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఈ నెల 30న జరగనున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు అధికారం కోసం తలపడుతున్నాయి. ఇక ఎన్నికల అధికారులు పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న క్రమంలో అన్ని నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని చెప్తున్నారు ఎన్నికల అధికారులు. ఇప్పటికే సోషల్ మీడియా ప్రచారంపైన కూడా నిఘా పెట్టిన ఎన్నికల అధికారులు పోలింగ్ కు ముందు 48 గంటల సైలెన్స్ పిరియడ్ లో రాజకీయపరమైన ఎస్ఎంఎస్, బల్క్ ఎస్ఎంఎస్ లను పంపరాదని ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు 48 గంటల ముందు అనగా నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5.00 గంటల నుండి 30 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సైలెన్స్ పీరియడ్ లో రాజకీయపరమైన ఎస్ఎంఎస్, బల్క్ ఎస్ఎంఎస్ ప్రసారాలను ఎన్నికల కమిషన్ నిలుపుదల చేయవలసిందిగా ఆదేశించిందని అన్నారు అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అసెంబ్లీ ఎన్నికల పోటీలో అభ్యర్థులు తమ ప్రచారంలో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు, సూచనలను ఉల్లంఘించేలా అభ్యంతరకరమైన ఎస్ఎంఎస్, బల్క్ ఎస్ఎంఎస్ లను పంపరాదని తెలిపారు. అభ్యంతరమైన ఎస్ఎంఎస్ లను పంపినట్లయితే వారిపై విచారణ జరిపి భారత శిక్ష స్మృతి (ఐపీసీ) ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, ఎన్నికల ప్రవర్తన నియమావళి 1961 ప్రకారం పంపిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. , అదేవిధంగా ఎస్ఎంఎస్ లు పంపడానికి అయ్యే ఖర్చులను కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 48 గంటల నిశ్శబ్ద వ్యవధిలో రాజకీయ స్వభావం గల ఎస్ఎంఎస్ ప్రచారాలను నిషేధించాలని, అభ్యర్థులు, వారి ఏజెంట్లు ఈ ఆదేశాలపై అప్రమత్తంగా ఉంటూ నిశ్శబ్ద సమయంలో పోలింగ్ ముగిసేంతవరకు సంక్షిప్త సందేశాలను పంపరాదని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *