సిరా న్యూస్, జైనథ్
పార్టీ గెలుపుకు కృషి చేయాలి
* ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే , ఎంపీ ఆశావహ అభ్యర్ధి అజ్మీరా రేఖానాయక్
* మండల నాయకులు, కార్యకర్తలతో భేటీ
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మనమంతా శాయ శక్తులా కృషి చేయాలని ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే , ఆదిలాబాద్ పార్లమెంట్ ఆశావహ అభ్యర్ధి అజ్మీరా రేఖానాయక్ పిలుపునిచ్చారు. అందరం ఒక్కతాటిపై నిలబడి కష్టపడి పని చేసి ఆదిలాబాద్ లోక్ సభ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగురవేయాలని అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అదృష్టమన్నారు.కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రమని ఎంత మంది వచ్చినా కలుపుకుంటుంది. అలాగే గెలవాలంటే అంతా కలిసికట్టుగా ఒక్కటై కష్టపడాలి అప్పుడే విజయం వరిస్తుంది. పార్లమెంట్ అశావహ అభ్యర్ధులు పార్టీలో చాలా మందే ఉన్నారు. కాని అనుభవం కూడా ఉంటేనే ఎన్నికల్లో గెలవడానికి స్కోప్ ఉంటుందన్నారు. తాను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమ సమయంలో స్థానిక ప్రజల ఒత్తిడి మేరకు టీఆర్ ఎస్ లో చేరానని అన్నారు. ఒక ఎమ్మెల్యే గా సీయం ను కలవాలంటే ఐదారు గంటలు వేచి ఉంటే కాని సాధ్యపడేది కాదని అక్కడ ఊపిరి తీసుకోవాలంటే కూడా భయపడే పరిస్థితి ఉండేదన్నారు. తాను తన నియోజక వర్గం కోసం కొట్లాడి నిధులు సాధించుకొని అభివృద్ధి చేసినట్టు తెలిపారు. ఒక రకంగా బీఆర్ ఎస్ హైకమాండ్ తనకు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ ఇవ్వందే మంచిదైందని తాను తన సొంత గూటికి చేరుకునే అవకాశం దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ లో స్వేచ్ఛ ఉంటుందని తిరిగి పార్టీలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. గతంలో జడ్పీటీసీగా , ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉందన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ టికెట్ కోసం ప్రయత్నిస్తే కాంగ్రెస్ అభ్యర్ధి బొజ్జు విజయానికి పని చేయి లోక్ సభ ఎన్నికలప్పుడు ఆలోచిద్దామన్నారని అందుకే తనకే టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. తనకు టికెట్ ఇస్తే మీ అందరి సహకారంతో ఎంపీగా కూడా గెలుస్తానన్నారు. అంతకు ముందు స్థానికంగా ఉన్న సుప్రసిద్ధ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్,జైనథ్ గ్రామ ఎంపీటీసీ కోడిచర్ల సుదర్శన్,లక్ష్మీపూర్ గ్రామ ఎంపీటీసీ కామ్రే మనోజ్,మాజీ మార్కేట్ కమిటీ చైర్మన్ మునిగేల విట్టల్ భారీ సంఖ్యలో జైనథ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.