సిరా న్యూస్;
నిజాం నిరంకుశపాలనకు, పెత్తందారి వ్యవస్థకు, వెట్టిచాకిరిలకు వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన గొప్ప విప్లవవీరుడు అనభేరి ప్రభాకర్ రావు
-నేడు ఆయన 76వ వర్ధంతి
నిజాం నిరంకుశపాలనకు, పెత్తందారి వ్యవస్థకు, వెట్టిచాకిరిలకు వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన గొప్ప విప్లవవీరుడు మన అనభేరి ప్రభాకర్ రావు,
కొందరి చావు చరిత్రకు ప్రాణం పోస్తది… త్యాగానికి చిరునామగా నిలుస్తది. స్పూర్తిగా నిలిచి గుండే గుండేను తట్టిలేపి ఉద్యమాలకు ఊపిరిపోస్తది. ఎదురు తిరగడం.. తుపాకీ గొట్టానికి ఎదురేగడం.. రొమ్ములు నిక్కబొడిచి దమ్ముంటే కాల్చరా..? అని గర్జించడం వీరులకు మాత్రమే సాధ్యమైతది. అనుభవించాడనికి అన్ని ఉన్న విద్య నేర్పిన విజ్ఙానంతో పేదలకోసం … సాయుధ పోరాటం చేసి తొలి అమరుడైన అనభేరి ప్రభాకర్ రావు 76వ వర్ధంతి నేడు.
15 ఆగస్టు 1910 లో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలేపల్లి గ్రామంలో ఓ తిరుగుబాటు జెండా పుట్టింది. అణచివేయబడుతున్న జనం కోసం ఓ ఉద్యమ కెరటం ఉదయించింది. ఆ జెండే అనభేరి ప్రభాకర్ రావు. ప్రభాకర్ రావు ఇంటిపేరు అనభేరి.. చేసింది రణభేరి. వెంకటేశ్వర్ రావు దేశ్ ముఖ్ , రాధాబాయిల గారాల బిడ్డ అనభేరీ ప్రభాకర్ రావు. ఈయన భార్య పేరు సరళాదేవి. వీరికి నాలుగురు సంతానం. భూస్వామ్య కుటుంబంలో పుట్టిన అనభేరి.. మచిలీపట్నం హిందూ హైస్కూల్ లో ప్రాథమిక విద్యను , హైదరాబాద్ చాదర్ ఘాట్‌లో హైస్కూల్ విద్యను , నిజాం కాలేజిలో ఇంటర్ పూర్తి చేసి బనారస్ లోని కాశీ విద్యపీఠ్ లో ఉన్నత విద్యనభ్యసించారు. పై చదువులకు బనారస్ వెళ్లొచ్చిన అనభేరి సక్కగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం బాటపట్టిండు.
దొరల పేరు చెబితే ఆ రోజుల్లో ఊళ్లన్ని వణికిపోయేవి. కానీ అనభేరీ ప్రభాకర్ రావు దొర పేరు చెబితే మాత్రం చేతులెత్తి దండంపెట్టేవారు. ఇప్పటికి అనభేరి అంటే అదే ప్రేమ అదే గౌరవం. దొర అని పిలుచుకునే అనభేరి ప్రభాకర్ రావు ప్రజల మనిషి అయ్యిండు. నైజాం అరాచాకాలను ఎదురించే మొనగాడైండు. వెట్టిచాకీరి , బానిసత్వాలను తన ఇంట్లో నుంచే సంస్కరించిన ప్రభాకర్ రావు .. రైతులకు సుంఖం నుంచి విముక్తి కలిగించిండు.
గుండెల పుట్టిన మంట గూట్లే ఉండనియ్యదంటరు. కడుపుల సల్ల కదలకుండ సుఖపడే ఇంట్ల పుట్టినా.. గుండెలో చదువు రగిలించిన స్వేచ్చ నినాదం అనభేరిని కుదురుగా ఉండనియ్యలేదు. సదువు పూర్తి చేసుకొని ఇంటికివచ్చిన అనభేరి కుటుంభాన్ని విడిచి నేరుగా తెలంగాణ సాయుధ రైతంగా పోరాటం బాటపట్టిండు. అజ్ఙాతంలోకి వెళ్లిన అనభేరి ఊరూరా దొరల గడీలపై దాడులు చేసి దస్తావేజులను దగ్ధం చేసిండు. విప్లవ కెరటమై నైజాం సర్కారును గజ్జుమనిపించాడు. అయితే 1948 మార్చి 14న ద్రోహులు అనభేరి కదిలికల గురించి నిజాం సైన్యానికి సమాచారం అందించడంతో.. రజాకార్లు , నిజాం సైన్యం భోజనం చేస్తున్న అనభేరి టీంపై కాల్పులకు దిగింది. కాల్పులను ప్రతిఘటిస్తూ హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గుట్టల్లోకి వెళ్లింది. కానీ దురదృష్టం వెంటాడింది… అనభేరి ప్రభాకర్ రావు ఈ కాల్పుల్లో వీరమరణం పొందిండు. ప్రభాకర్ రావుతో పాటు మరో 12 మంది ఉద్యమకారులు చనిపోయారు.
అనభేరి ప్రభాకర్ రావు మరణం రజాకార్లు.. నిజాం సైన్యానికి కొండంత సంతోషాన్నిచ్చింది. అనభేరి మరణం తరువాత ఆయన కోటును మరణసూచకంగా ఓ చెట్టుకు వేలాడదీసిన నిజాం సైన్యం షేర్ మరగయారే.. అంటూ నినాదాలు చేశారు. ఉద్యమకారులను ఊళ్లోకి తీసుకొచ్చి సమూహిక దహనం చేశారు. అనభేరి రణం ఆగిపోవడంతో పేదలు ఉద్యమకారులు కన్నీరు మన్నీరైండ్రు. అనేక మంది ఉద్యమకారులు యేండ్లకొద్ది అనభేరి ప్రభాకర్ రావు స్పూర్తిగా ఉద్యమం కొనసాగించారంటే అనభేరి ఉద్యమం ప్రజల్లో ఎంత ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఉద్యమకారులంతా అనభేరి గుర్తుగా గ్రామంలోని గుట్టవద్ద అనభేరి సమాధిని నిర్మించారు. ఇక్కడే ప్రతియేడు అనభేరి జయంతి , వర్థంతులను నిర్వహిస్తున్నారు.
========================