సిరా న్యూస్,విజయవాడ;
కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఇద్దరు ఐఏఎస్‌లకు నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఐఏఎస్ అధికారులు జె. శ్యామలరావు, పోలా భాస్కర్‌కు జైలు శిక్ష విధించింది. ఇద్దరు ఐఏఎస్‌లకు రూ. వెయ్యి చొప్పున జరిమానా కూడా విధించారు. నీరు-చెట్టు అంశంపై హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారని హైకోర్టు తేల్చింది. వచ్చే నెల 8లోపు రిజిస్ట్రార్ జ్యుడీషియల్ వద్ద లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. 2019 ముందు రాష్ట్రంలో జరిగిన నీరు-చెట్టు పనుల బిల్లులు కూడా ఇప్పటికీ చెల్లించలేదు. అవన్నీ చాలావరకు చిన్న మొత్తాలే. వీరంతా కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశించినా బిల్లులు చెల్లించకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసులూ నమోదయ్యాయి. ఈ ధిక్కరణ కేసులకు సంబంధించినవే ఇంకా రూ.270 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. ఇవికాక మరో రూ.400 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు ఉన్నాయి. వాటిని తక్షణమే చెల్లించాలని కాంట్రాక్టర్లతో పాటు బిల్డర్ల అసోసియేషన్ వరుసగా వినతులు సమర్పిస్తున్నా చెల్లించలేదు. రహదారులు భవనాల శాఖ గత ఆర్థిక ఏడాదిలోనే బిల్లులు చేసి చెల్లించాల్సిన బకాయిలు రూ.332 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. బడ్జెట్ మంజూరు లేక దాదాపు రూ.500 కోట్ల బిల్లులు సీ.ఎఫ్.ఎమ్.ఎస్.లో అప్లోడ్ చేయలేదు. పంచాయతీరాజ్శాఖలోనూ రూ.430 కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. వీటికి చెల్లింపులు చేయకపోవడంతో బాధితులు కోర్టుకు వెళ్లారు. చెల్లించాలనికోర్టు తీర్పు ఇచ్చినా చెల్లించకపోగా.. ఎంపిక చేసుకున్న కొందరికే మంజూరు చేస్తూ.. మిగిలిన వారి విషయంలో వివక్ష చూపుతోంది. హైకోర్టు జోక్యంతో కొంతమందికి ఉపశమనం లభించినా.. ప్రభుత్వం బిల్లులను చెల్లించలేదంటూ హైకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యాల సంఖ్య వేలల్లో ఉంది. నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ ప్రకారం.. 2023 అక్టోబర్ 23 వరకూ దేశ వ్యాప్తంగా లక్షా 17 వేల 324 కోర్టు ధిక్కరణ కేసులు హైకోర్టుల్లో పెండింగ్ల్లో ఉన్నాయి