సిరా న్యూస్, ఆదిలాబాద్:
గిమ్మ పరీక్ష కేంద్రంలో పెచ్చులూడిన స్లాబ్… విద్యార్థిని తలకు గాయం
+ తృటిలో తప్పిన భారీ ప్రమాదం
+ విద్యార్ధిని తలకు మూడు కుట్లు
+ ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని గిమ్మ జడ్పి ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్షా కేంద్రంలో స్లాబ్ పెచ్చులుడటంతో, పరీక్ష రాస్తున్న విద్యార్థిని పడాలి అక్షయ తలకు గాయమైంది. గిమ్మ గ్రామానికి చెందిన పడాలి అక్షయ పిప్పర్ వాడ గ్రామంలోని అభ్యుదయ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. మంగళవారము ఉదయం హిందీ పరీక్ష రాసేందుకు జడ్పి ఉన్నత పాఠశాలలోని 5 నెంబర్ గదిలో కూర్చుంది. మధ్యాహ్నం 12:20 గంటల సమయంలో పరీక్ష పేపర్లు ఇన్విజిలేటర్ పురుషోత్తంకు ఇచ్చేందుకు వెళ్లగా, గాలి దుమారంతో ఒక్కసారిగా స్లాబ్ పెచ్చులుడాయి. దీంతో విద్యార్థిని అక్షయ తలకు గాయం కాగా అక్కడే ఉన్న వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి పక్కనే ఉన్న ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్షయను పరీక్షించిన వైద్యురాలు డా. సుచల మూడు కుట్లు వేశారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉండడంతో చికిత్స తరువాత ఆమెను ఇంటికి పంపించారు. అయితే విద్యార్థిని అక్షయతో పాటు ఇన్విజిలేటర్ పురుషోత్తంకు సైతం స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. పాఠశాల భవనం పురాతనమైంది కావడంతో శిథిలావస్థకు చేరుకుందని, అలాంటి భవనంలో 10 వ తరగతి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష రాసే విద్యార్థులకు రక్షణ లేకపోతే ఎలా అంటూ వాపోతున్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నారు.