సిరా న్యూస్, ఆదిలాబాద్
మీడియా సహకారం అందించాలి
* జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రాజర్షి షా
* మీడియా సెంటర్ ప్రారంభం
ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రాజర్షి షా కోరారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మీడియా సెంటర్,మీడియా సర్టిఫికేషన్ ఆండ్ మానిటరింగ్ కమిటీ(ఎం.సి.ఎం.సి) మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం తో కలిసి ప్రారంభించారు. ఎం.సి.ఎం.సి లో ఏర్పాటు చేసిన టీవీ లను, సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు డీపీఆర్ ఓ ద్వారా అందించడం జరుగుతుందని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎం.సి.ఎం.సి) ఏర్పాటు ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం,పత్రికల్లో ప్రచురించిన రాజకీయ ప్రకటనలు అభ్యర్థి ఎన్నికల వ్యయం లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. శాటి లైట్ ఛానల్ లు, కేబుల్ నెట్‌వర్క్‌లు, సోషల్ మీడియా,ఈ పేపర్ లో ప్రకటనలు,బల్క్ ఎస్.ఎం.ఎస్.,వాయిస్ మెసేజ్ లు,ఇతర ఆడియో-వీడియో విజువల్ మీడియాలతో సహా రాజకీయ ప్రకటనలను ఎంసిఎంసి నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే విడుదల చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు.సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టిసారించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేసారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమం లో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైని కలెక్టర్ వికాస్ మహతో ,జిల్లా పౌర సంబంధాల అధికారిణి తిరుమల,ఈడీఎం రవీందర్ ,తదితరులు పాల్గొన్నారు