సిరా న్యూస్, ఇచ్చోడ
రహదారి పక్కనే డంపింగ్ యార్డు
* పొగతో ప్రయాణికులు ఇబ్బందులు
* పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మేజర్ గ్రామపంచాయతీ అధికారులు జున్ని గ్రామపంచాయతీ పరిధిలోని జాతీయ రహదారి పక్కనే డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు. దీంతో ప్రతిరోజు ఇచ్చోడ మండల కేంద్రంలో రోజు సేకరించిన చెత్తను వాహనాలలో ఇక్కడికి తరలిస్తారు. పారిశుధ్య కార్మికులు ప్రతిరోజు సాయంత్రం చెత్తను తగులబెడుతుండడంతో వెలువడుతున్న పొగ రహదారిని కమ్మేస్తోంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి పొగ అధికమై ముందు వెళ్తున్న వాహనాలను గుర్తించలేని పరిస్థితిలో ప్రమాదాలు జరిగితే ఎవరూ బాధ్యులని వాహనదారులు వాపోతున్నారు. చెత్త నుంచి వెలువడుతున్న దుర్గంధం పరిసర ప్రాంతవాసులు, ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తుంది. గాలి వీచినప్పుడు దుర్వాసన భరించలేని పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా అధికారులు స్పందించి డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి వేరే చోటికి తరలించాలని స్థానికులు వాహనదారులు కోరుతున్నారు.