సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. గురువారం జరిగిన పోలింగ్ కు సంబంధించి శుక్రవారం హైదరాబాద్ లోని మీడియాసమావేశంలో వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 70.74 శాతం పోలింగ్ నమోదైందని, 2018 (73.37%)తో పోలిస్తే ఇది 3 శాతం తక్కువని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా90.03 శాతం, హైదరాబాద్ లో అత్యల్పంగా 46.56 శాతం పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. నియోజకవర్గాల వారీగా చూస్తే మునుగోడులో అత్యధికంగా 91.5 శాతం, యాకుత్ పురాలో 39.6 శాతం పోలింగ్నమోదైందని వివరించారు. చాలా చోట్ల రాత్రి 9:30 వరకూ ఓటింగ్ ప్రక్రియ సాగినట్లు వివరించారు. డిసెంబర్ 3న జరగబోయే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం జిల్లా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని వికాస్ రాజ్వెల్లడించారు. మొత్తం 49 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని వివరించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారని, ఉదయం 8:30 గంటల నుంచి ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపుప్రారంభం అవుతుందని చెప్పారు. ‘రాష్ట్రంలోని 79 నియోజకవర్గాల్లో 75 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. ఓట్ ఫ్రం హోం మంచి ఫలితాన్ని ఇచ్చింది. తెలంగాణలో ఎక్కడా రీపోలింగ్ కు అవకాశమే లేదు.’ అనిసీఈవో వికాస్ రాజ్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో 1.80 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని, 80 ఏళ్లు పైబడిన వారికి ఓట్ ఫ్రం హోం అవకాశం ఇచ్చామని వివరించారు. ఎన్నికల కోసం 2లక్షల కంటే ఎక్కువ మంది సిబ్బంది కష్టపడ్డారని చెప్పారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. 18 – 19 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఓటర్లు 3.06 శాతం ఉన్నట్లుపేర్కొన్నారు.