సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెల 6వ తేదీన తుక్కుగూడలో జనజాతర పేరుతో భారీ బహిరగంసభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తుక్కుగూడలోని 60 ఎకరాల విశాలమైన మైదానంలో జన జాతర బహిరంగ సభను కాంగ్రెస్ నిర్వహించనుంది. మైదానం పక్కనే వాహనాల పార్కింగ్‌కు సుమారు 300 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. జనజాతర సభకు ఆదిలాబాద్ మొదలు ఆలంపూర్ వరకు, జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు అన్నిగ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి ప్రజల్ని తరలించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కనీసం పది లక్షల మంది జనజాతరకు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే తుక్కుగూడ జన జాతర సభ ప్రాంగణాన్నిసందర్శించి సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎంత పెద్ద మొత్తంలో ప్రజలు సభకు తరలివచ్చినా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేసేలా సీఎం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శాసనసభ ఎన్నికలకు తుక్కుగూడ నుంచే సమరశంఖం పూరించింది. తెలంగాణ విలీన దినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబరు 17న తుక్కుగూడలో విజయభేరి పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించింది. విజయభేరి వేదిక మీద నుంచే సోనియగాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. ఆరు గ్యారెంటీలు తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కొలువుదీరింది. తమకు కలిసివచ్చిన తుక్కుగూడ నుంచే లోక్‌సభ ఎన్నికలకు సమరశంఖం పూరించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. తెలంగాణ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల హామీ ప్రజల్లోకి దూసుకెళ్లినట్లుగానే లోక్‌సభ ఎన్నికలకు ఇచ్చే అయిదు గ్యారెంటీలు దేశంలోని అన్ని మూలలకు, అన్ని వర్గాల్లోకి వెళుతాయని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం బలంగా నమ్ముతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తుక్కుగూడ వేదికగానే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఢిల్లీ రాంలీలా మైదాన్‌లో లక్షలాది ప్రజల సమక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరుతుందని చెబుతున్నారు. జూన్ 9వ తేదీన ఎర్రకోటపై జెండా ఎగురవేస్తామని ప్రకటించారు. ఈ సభలో జాతీయ స్థాయిలో అమలు చేస్తామని హామీ ఇవ్వనున్న ఐదు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించనుంది. తుక్కుగూడ సభ తర్వాత కాంగ్రెస్ మరింత దూకుడు పెంచుతుందని.. ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.