సిరా న్యూస్,గాజా ;
హమాస్‌తో ఏడు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన వెంటనే గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. హమాస్‌ను తుదముట్టించేంత వరకు యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహూ మాటలను నిజంచేస్తూ.. ఆ దేశ సైన్యం గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షం కురించింది. దీంతో కాల్పుల విరమణ ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 178 మంది పాలస్తీనా ప్రజలు మరణించినట్లు గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది. పెద్ద సంఖ్యలో పౌరులు గాయపడినట్లు తెలిపింది. ఈ దాడులతో గాజాలో మళ్లీ ఆసుపత్రుల్లో దారుణపరిస్థితులు ఏర్పడుతాయని ఐక్యరాజ్య సమితికి చెందిన పలు సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి.ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అక్టోబర్ 24న జరిగింది. మొదట నాలుగు రోజులే ఒప్పందం చేసుకున్నప్పటికీ, తర్వాత బందీల విడుదల కోసం మరో మూడు రోజులు పెంచారు. దీంతో ఇరువైపుల నుంచి దాడులు జరగలేదు. ఈ ఏడు రోజుల్లో గాజాకు మానవాతా సాయం అందడంతోపాటు ఇరుపక్షాల మధ్య బందీల విడుదల జరిగింది. అయితే గడువు శుక్రవారం ఉదయంతో ముగియడంతో కాల్పుల విరమణను ఇంకొన్నిరోజులపాటు కొనసాగించాలని అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ కాల్పులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గాజాలో మరోసారి మారణహోహం కొనసాగుతున్నది.