సిరా న్యూస్, ఆదిలాబాద్:
సంక్షేమ పథకాలన్నీ అంబేద్కర్ చలువతోనే…
నేడు దేశంలో బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలతో పాటు సామాన్య ప్రజల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలు అన్ని కూడ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చలువతోనే అమలవుతున్నాయని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలో వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి వేడుకల్లో జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయం, బస్ స్టాండ్, అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రాజ్యాంగం లోని ఆర్టికల్ 14 తో అందరికీ సమాన అవకాశాలు కల్పించడం జరిగిందని అన్నారు. రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు అన్నీ కూడా అంబేద్కర్ తోనే సాధ్యమయ్యాయని ఆయన అన్నారు. భారత రాజ్యాంగ రూపకర్త అయినటువంటి అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించినందుకు గాను అధికారులు, వివిధ దళిత సంఘాల నాయకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.