అభ్యర్ధుల మార్పు

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలు అభ్యర్ధులను ఖరారు చేసుకుని ప్రచార రంగంలో తలమునకలయ్యాయి. కానీ పలు స్థానాల్లోఅభ్యర్థుల మార్పుపై జోరుగా ప్రచారం సాగుతోంది. అందరికంటే ముందే క్యాండిడేట్స్‌ను ఖరారు చేసిన బీజేపీ కూడా కొన్ని స్థానాల్లో అభ్యర్థులపై పునరాలోచన చేస్తోందట. ఇంతకీ అంతలా అభ్యర్థిని మార్చే యోచన ఎందుకొచ్చింది..? ఏ స్థానాల్లో అభ్యర్థులు ఫిట్ అవడం లేదు..?డబుల్ డిజిట్ టార్గెట్‌తో ముందుకెళ్తోంది కమలదళం. సుదీర్ఘ కసరత్తు తర్వాత బలమైన అభ్యర్థులతో జాబితాలు విడుదల చేసింది. అయితే ఇందులో రెండు మూడు చోట్ల అభ్యర్థులను మార్చాలంటూ పార్టీలో డిమాండ్ వినిపిస్తోంది. ప్రకటించిన అభ్యర్థుల తీరుతో కూడా మార్పు అనివార్యమయ్యేలా ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పెద్దపల్లి క్యాండేట్‌పై పార్టీ హైకమాండ్‌ పునరాలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు ఖమ్మం, నల్గొండ లోక్ సభ అభ్యర్థులను కూడా మారుస్తారంటూ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.ప్రజాదరణ ఉన్నవారు, బలమైన నాయకులను ఎన్నికల బరిలోకి దించాలని ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించింది కమలంపార్టీ. కొన్ని స్థానాల్లో వేరే పార్టీ నేతలను చేర్చుకుని మరీ పదిహేడు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. పెద్దపల్లిలో కూడా కాస్త స్ట్రాంగ్ లీడర్ కావాలని కాంగ్రెస్ నుంచి గోమాస శ్రీనివాస్‌ని చేర్చుకుని టికెట్‌ ఇచ్చింది. ఆయన ఇప్పటిదాకా ఆయన పెద్దగా ప్రచారం చేసినట్లు కానీ, పార్టీ శ్రేణులను కలిసిన దాఖలాలు కానీ లేవు. టికెట్ ఇచ్చినా ఆయన గడపదాటటం లేదని స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ గోమాస ఇదే తరహాలో ఇతర పార్టీల్లో కూడా టికెట్ తెచ్చుకొని ఇంట్లో కూర్చునేవారని అక్కడి నేతలు అంటున్నారు. స్థానిక నేతలను కలుపుకుని పోవడం లేదని.. మోదీ హవా, పార్టీ సానుకూలతను వాడుకోవడం లేదని గోమాస శ్రీనివాస్‌పై ఇప్పటికే పార్టీ పెద్దలకు ఫిర్యాదులు అందాయి. దీంతో పెద్దపల్లి టికెట్ మార్చే అవకాశం ఉందని.. గతంలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేశారట!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *