Post Views: 147
సిరా న్యూస్,తిరుపతి;
తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆహార పానీయాలు అందిస్తున్నారు.
తుఫాను ప్రభావంతో సూళ్లూరుపేట మండలంలోని లోతట్టు ప్రాంతమైన వట్రపాలెం గ్రామం నీట మునిగింది. ఆ గ్రామంలోని ప్రజలను నిన్నటి నుండి ఇప్పటివరకు సుమారు 500 మందికి పైగా సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. క్రమంగా నీటిమట్టం 5 అడుగుల ఎత్తు వరకు పెరిగింది. అయినా కూడా సూళ్లూరుపేట పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వృద్ధులను, పిల్లలను తమ భుజస్కందాలపై మోస్తూ సురక్షితంగా జలదిగ్బంధం నుంచి పునరావాస కేంద్రాలకు తరలించారు. సమయం ఏదైనా పరిస్థితులు వేరైనా పోలీసు వారు నిత్యం ప్రజాసేవే పరమావధిగా భావించి విస్తృతంగా యుద్ధప్రాతిపదికన ప్రజలకు ఉత్తమమైన సేవలను అందిస్తున్నారు.
వంకలు, వాగులు, నదులు పొంగి పొర్లుతున్నందున ఎలాంటి ప్రమాదం జరగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ భద్రతను కట్టు దిట్టం చేస్తున్నారు. అలాగే చిన్న ప్రాణ హాని జరగకుండా చర్యలు చేపడుతున్నారు. తుఫాను మొదలైన నిన్నటి నుండి 24/7 పోలీసులు ప్రజాక్షేత్రంలో ఉండి సహాయక చర్యలను చేపడుతున్నారు.