ఇంకా ఆగని ఓట్ల రచ్చ

సిరా న్యూస్,విజయవాడ;

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో అవకతవకల అంశం రాజకీయం దుమారం రేపుతోంది. అధికార వైసీపీ నేతలే ఓటర్ల జాబితాలో టీడీపీ, జనసేన సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారని తెలుగు దేశం పార్టీ, జనసేన ఆరోపిస్తున్నాయి. ఇదే అంశంపై ఇరు పార్టీలు అటు ఎన్నికల కమిషన్‌తో పాటు, ఇటు జిల్లాల వారీగా కలెక్టర్లను కలిసి పిర్యాదులు చేస్తున్నారు. ఓట్ల తొలగింపు వ్యవహారంలో కొందరు అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో తప్పుడు ఓటర్ల జాబితా తయారు చేస్తున్నారని టీడీపీ, జనసేన పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.ఇప్పటి వరకు ప్రజా సమస్యలపై ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేస్తున్న టీడీపీ, జనసేన పార్టీలు ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అవకతవకలపై కూడా కలిసి పోరాటం చేయాలని నిర్ణయానికి వచ్చాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో జరిగిన అవతవకలను కేంద్రీకరించి వాటిని ప్రజల్లోకి వెళ్లి వివరించాలని భావిస్తున్నాయి. అందులో భాగంగా రెండు పార్టీలు నేతలు రాష్ట్రంలోని అన్ని నియజకవర్గాల్లోనూ ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాలో పేర్లను పరిశీలిస్తున్నారు. కొత్త ఓటర్ల చేరిక, పోలింగ్ బూత్‌ల మార్పు, ఓటర్ల డబల్ ఎంట్రీపై ప్రతి ఇంటికి వెళ్ళి పరిశీలించనున్నారు.ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా నేపథ్యంలో ప్రజా సమస్యలు ప్రభుత్వ వైఫల్యాలతో పాటు అత్యంత ప్రాధాన్యత అంశంగా గుర్తించి ఓటర్ల జాబితాపై ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ సవరించిన ఓటర్ల ముసాయిదా ప్రకటించిన నేపథ్యంలో వీటిపై క్షేత్ర స్థాయిలో జనసెన టీడీపీ నేతలు స్వయంగా వెళ్లి పరిశీలించనున్నారు. ఇప్పటికే ప్రాథమికంగా వచ్చిన సమాచారం మేరకు వచ్చిన వివరాలను సేకరించిన ఇరు పార్టీలు వరుసగా ఎన్నికల కమిషన్ దృష్టికి అన్ని అంశాలను తీసుకుని వెళ్ళాయి. అయితే ఈ విషయంలో 100 రోజుల ఉమ్మడి కార్యాచరణ పేరుతో ప్రతి ఇంటికి జనసేన, టీడీపీ జెండాలతో వెళ్లి ఓటర్ల జాబితాలను పరిశీలించడంతో పాటు తమ పరిశీలనలో వచ్చిన అన్ని అంశాలను పార్టీ అధిష్టానం దృష్టికి నివేదికల ఇవ్వనున్నాయి.ఏపీలో ఓటర్ల జాబితా సవరణపై టీడీపీ, జనసేన సీరియస్‌గా దృష్టి సారించాయి. దేశమంతా ఓటు వెరిఫికేషన్ ప్రక్రియ జరిగితే ఏపీలో ఎందుకు చేపట్టలేదని టీడీపీ జనసేన ప్రశ్నిస్తున్నాయి. ఏపీలో 10 లక్షల ఓటర్లకు సంబంధించి ఫార్మ్ 6,7,8ని అప్లయ్ చేశాయని వీటిపై ఈసీ దృష్టి సారించడం లేదని రెండు పార్టీల నేతలు అంటున్నారు.అలాగే, గతంలో ఏపీలో ఒకే కుటుంబంకు చెందిన ఓట్లు ఒకే పోలింగ్ బూత్ పరిధిలోకి వచ్చేవని ఇప్పుడు అందుకు భిన్నంగా పోలింగ్ బూత్ లలో మార్పులు చేశారని టీడీపీ, జనసేన నేతలు ధ్వజమెత్తారు. ఏపీలో ఒకే వ్యక్తికి రెండు ఓట్లు, దాదాపు 150 వరకు పోలింగ్ స్టేషన్లు ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా, వాటిపై చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు టీడీపీ, జనసేన నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల పరిధిలో ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి పరిశీలన చేపడుతున్నాయి.పోలింగ్ స్టేషన్లు, పోలింగ్ బూత్‌ల వరకు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. మరోవైపు కొన్ని చోట్ల పోలింగ్ బూత్ ల మార్పుపై సైతం హై కోర్టును ఆశ్రయించాయి. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లా, విశాఖపట్నం జిల్లాకు చెందిన నేతలు హై కోర్టులో పోలింగ్ స్టేషన్లు, ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అవకతవకలపై పిటిషన్లు సైతం దాఖలు చేయగా, వీటిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇదిలా ఉంటే కొత్త ఓటర్ల చేరిక పేరుతో పాత ఓటర్లను తొలగిస్తున్నారని రెండు పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలన్న ఆదేశాలతో ప్రత్యేకంగా ప్రతి ఇంటికి వెళ్ళి పర్యటనలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *