సిరాన్యూస్, బేల
రైతు రుణమాపీకి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ : మంత్రి సీతక్క
* బేల మండలంలో కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో విస్తృత ప్రచారం
రైతు రుణమాఫీకి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని, త్వరలోనే ఇచ్చిన హామీని తప్పక అమలు చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్దిశాఖ మంత్రివర్యులు ధనసరి సీతక్క అన్నారు. కానీ కొందరు అసత్య ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని, అలాంటి వారి మాటలు నమ్మవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులను ఆదుకుంటామని, కడుపులో పెట్టుకుని చూసుకుంటామని స్పష్టం చేశారు. తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని ఆమె పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా బేల మండలకేంద్రంలో అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో విస్తృతంగా పర్యటించారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరపున ప్రచారం చేశారు. బేలకు చేరుకోగానే వారికి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళ్లర్పించారు. అనంతరం రోడ్‌షోలో పాల్గొన్నారు. అభివాదం చేస్తూ ముందుకుసాగారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దాదాపు 84 లక్షల మందికి రైతుబంధు పడిందని, మరో నాలుగు లక్షల మందికి త్వరలోనే డబ్బులు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఇవాళ రిజర్వేషన్లను రద్దు చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. దేవుడు పేరు చెప్పుకుని బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా పబ్బం గడుపుకుంటోందన్నారు. నీచమైన రాజకీయాలు చేయడం బీజేపీకే చెల్లుతుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ చేస్తుందే చెబుతుందని..అది చేసి చూపిస్తుందని అన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీల్లో ఇప్పటికే ఐదింటినీ అమలు చేశామన్నారు. అనంతరం అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. గత ప్రభుత్వానికి చెంప చెల్లుమనేలా ప్రజలు తీర్పునిచ్చి కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించారని అన్నారు. అదే స్ఫూర్తితో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చెయ్యి గుర్తుకు ఓటువేసి ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల మే 13న పోలింగ్ బూత్‌లకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకే తమ ఓట్లు గుద్దాలని, ప్రత్యర్థుల బాక్సులు బద్దలైపోవాలంటూ పార్టీ శ్రేణులు, ప్రజల్లో జోష్ నింపారు. ఆ తర్వాత ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ మాట్లాడుతూ…పేదలు, బడులు, బలహీనవర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం నిత్యం తపన పడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. బడులు, గుడులు కట్టించడంతోపాటు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ఏమీ చేయని బీఆర్ఎస్‌కు ఓటు వేస్తారా… అన్ని చేసినా కాంగ్రెస్‌కే మద్దతు తెలుపుతారా ప్రజలే నిర్ణయించాలన్నారు.అనేక హామీలిచ్చి విస్మరించిన బీజేపీ, బీఆర్ఎస్ నాయకులను ఓట్లు అడగానికి వచ్చినప్పుడు నిలదీయాలన్నారు. పదేండ్లలో ఏంచేశారో ప్రశ్నించాలన్నారు. పేదింటి ఆడబిడ్డగా, మీఆడపడుచుగా భావించి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం పార్లమెంట్‌లో గొంతెత్తి నినదిస్తానన్నారు. ప్రజలతోనే మమేకమై పనిచేస్తానని తెలిపారు.