చంపేస్తున్న ఎండలు

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి నమోదవుతున్నాయి. వడదెబ్బతో శనివారం 19 మంది మరణించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. భానుడు నిప్పుల వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఎండల తీవ్రతతో పాటు వేడి గాలుల ఉధృతి తీవ్రంగా ఉంది. దీంతో ప్రజలు అల్లాడి పోతున్నారు. బయటకు వచ్చేందుకే భయపడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. గాలిలో తేమశాతం కూడా దారుణంగా పడిపోయింది. హైదరాబాద్ నగరంలో గతంలో ఏ సీజన్ లో వీయనంతగా వేడిగాలులు వీస్తుండటంతో వాతావరణ శాఖ కూడా ప్రజలను అప్రమత్తం చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకుని రావాల్సిందేనని చెబుతుంది. ఇప్పటికే వడదెబ్బతో ఆసుపత్రి పాలయిన వారి సంఖ్య అధికంగా ఉండటంతో ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి.అత్యధికంగా కరీంనగర్, జగిత్యాల, నల్లగొండ, మంచిర్యాల, నారాయణపేట్, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక్కడ 46 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. మే నెల మొదటి వారంలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక రానున్న కాలంలో ఎండల తీవ్రత ఎలా ఉంటుందన్న భయం మరింత ఆందోళనకు గురి చేస్తుంది. యాభై డిగ్రీలకు దాటినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *