సిరా న్యూస్;
బిజెపికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయా? ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటడం కష్టమా? నాలుగు విడతల్లో పూర్తయిన పోలింగ్లో ఆ పార్టీ వెనుకబడిందా? తక్కువ శాతం ఓట్లు పోలింగ్ కావడం దేనికి సంకేతం? ఇండియన్ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చి నడుస్తోంది. గత ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధించిన భారతీయ జనతా పార్టీకి ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితులు తప్పవని తెలుస్తోంది. బిజెపి ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం లేదని.. మిత్రపక్షాల అవసరం తప్పనిసరి అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బిజెపి మాత్రం ఈ ఎన్నికల్లో ఒంటరిగా 370 సీట్లు, మిత్రపక్షాలతో కలిసి 400 సీట్లు దక్కించుకోవాలన్న ఆలోచనలో ఉంది. కానీ అది అంత ఈజీ కాదని తెలుస్తోంది.దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడతల్లో పోలింగ్ పూర్తయింది. జూన్ 1 తో ఏడో దశ పోలింగ్ ముగియనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. కనీసం 400 లోక్సభ స్థానాలను లక్ష్యంగా పెట్టుకొని బిజెపి ఎన్నికల్లో గట్టిగానే శ్రమించింది. అయితే సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటి అవకాశం లేదని తెలియడంతో కమలనాధుల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు దశల పోలింగ్ లో తక్కువ కూలింగ్ శాతం నమోదయింది. ఇది అధికార పార్టీలో కలవరానికి కారణమవుతోంది. ఏప్రిల్ 19న జరిగిన తొలి దశ పోలింగ్ ను.. గత ఎన్నికలతో పోల్చుకుంటే నాలుగు శాతం ఓటింగ్ తక్కువగా నమోదయింది. అదే నెల 26న జరిగిన రెండో విడత పోలింగ్లో మూడు శాతం తక్కువగానే పోలింగ్ నమోదయింది. మూడో దశలో 1.2%, నాలుగో దశలో 2.3 శాతం ఓటింగ్ తక్కువగా నమోదు అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో మోడీ గ్రాఫ్ పడిపోయిందన్న సంకేతాలు రావడం బీజేపీకి లోటు.ప్రస్తుతం బిజెపి కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడానికి గొప్పగా చెప్పుకుంటుంది. దేశవ్యాప్తంగా దానినే ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కానీ కాశ్మీర్లో బిజెపి పోటీ చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కాశ్మీర్ లోక్సభ ఎన్నికల బరిలో ఏ ఒక్క బీజేపీ అభ్యర్థి కూడా లేకపోవడం రికార్డ్. కాశ్మీర్లో మూడు లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఒక్కచోట కూడా బిజెపి పోటీలో పెట్టలేదు. బిజెపి గ్రాఫ్ పడిపోవడం వల్లే అక్కడ పోటీ చేయడం లేదన్న ప్రచారం ఉంది. అయితే కాశ్మీర్ విషయం పక్కన పెడితే.. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 272 సీట్లు రావాలి.. కానీ విజయం ముంగిట బిజెపి నిలిచిపోతుందని… అప్పుడు స్నేహితుల మద్దతు కీలకమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ విశ్లేషణలతో కాషాయ దళంలో కలవరం రేగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న నియోజకవర్గం వారణాసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ మతంలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటిగానే కాదు, భూమ్మీద వేల ఏళ్లుగా మనుగడలో ఉన్న చారిత్రక నగరంగానూ వారణాసి ప్రసిద్ధిగాంచింది. 2014లో మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌లోని వడోదర లోక్‌సభ నియోజకవర్గంతో పాటు వ్యూహాత్మకంగా వారణాసిలోనూ పోటీ చేశారు. ఈ చర్య ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధిక సీట్లు గెలుపొంది కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు దోహదపడింది. 2019లో మరోసారి పోటీ చేసి గెలుపొందగా, ఇప్పుడు మూడోసారి మోదీ మళ్లీ పోటీ చేస్తున్నారు. జూన్ 1న చివరి విడతలో భాగంగా పోలింగ్ జరుపుకోనున్న ఈ నియోజకవర్గంలో మోదీని మరింత భారీ మెజారిటీతో గెలిపించడం కోసం పార్టీ శ్రేణులు శ్రమిస్తున్నాయి. మోదీని ఓడించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా జట్టుకట్టిన విపక్షాలు.. ఈ నియోజకవర్గంలోనూ ఐక్య పోరాటం చేస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌ను గెలిపించడం కోసం ఆ పార్టీతో పాటు రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీ సమాజ్‌వాదీ కూడా శ్రమిస్తోంది. అజయ్ రాయ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగానూ ఉన్న విషయం గమనార్హం. “అబ్‌కీ బార్ దస్ లాఖ్ పార్” అంటూ మొత్తం 10 లక్షల ఓట్లు దాటి మోదీకి పోలయ్యేలా రాజకీయ నినాదంతో బీజేపీ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తద్వారా 7 లక్షలకు పైగా మెజారిటీ సాధించవచ్చన్నది వారి ఆలోచనగా కనిపిస్తోంది. 1991 నుంచి ఈ స్థానంలో బీజేపీయే గెలుపొందుతూ వస్తున్నప్పటికీ 2004లో మాత్రం ఓటమిపాలైంది. మోదీ హయంలో కాశీలో జరిగిన అభివృద్ధి, కాశీ విశ్వనాథ్ కారిడార్ ఏర్పాటు, నగరంలో మౌలిక వసతులు, విమానాశ్రయం, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, ఆధునీకరణతో పాటు నగరంలో ఎక్కడికక్కడ వంతెనల నిర్మాణం గురించి కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. అలాగే నిర్మాణంలో ఉన్న క్యాన్సర్ ఆస్పత్రి, క్రికెట్ స్టేడియం, నగరంలో అమలు చేస్తున్న పరిశుభ్రత వంటివి కూడా కలిసొచ్చే అంశాలు. కొన్ని దశాబ్దాలుగా ఈ నగరాన్ని సందర్శిస్తున్న దేశ, విదేశీ యాత్రికులు నగరంలో చోటుచేసుకుంటున్న మార్పులు, జరుగుతున్న అభివృద్ధి, పెరిగిన మౌలిక వసతులను ప్రత్యక్షంగా గమనిస్తున్నారు.మిగతా మూడు విడతల పోలింగ్ లోనైనా రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైతే.. బిజెపి గట్టెక్కినట్టే.