సిరాన్యూస్, బోథ్
ప్రభుత్వం అన్నదాతలను ఆదుకోవాలి : బలరాం జాదవ్
* మార్కెట్ యార్డు సందర్శన
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో బుధవారం కురిసిన అకాల వర్షానికి జొన్న పంట పూర్తి గా తడిసిపోయింది. ఈ విషయం చరవాణి ద్వారా తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గురువారం బోథ్ మార్కెట్ యార్డును సందర్శించారు. జొన్న పంటను అమ్మడానికి వచ్చిన రైతుల కష్టాలను చూసి నివ్వెరపోయారు. బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి జొన్న పంట తడిసి ముద్దయిందని వాపోయారు. మార్కెట్లో సరైన వసతులు కల్పించి, జొన్న పంటను వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డికి విజ్ఞప్తి చేశారు . నాలుగు నెలల పాటు కష్టపడి పండించిన పంట కళ్ళ ముందే తడిసిపోయిందని రైతులు బలరాంతో గోడు వెళ్లబోసుకున్నారు .రైతులు పండించిన పంటను వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బలరాం జాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.