సిరాన్యూస్, ఆదిలాబాద్
పాయల్ శంకర్, గండ్రత్ సుజాత, అల్లూరి సంజీవ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం
ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్‌తో కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులు గండ్రత్ సుజాత, అల్లూరి సంజీవ్‌రెడ్డి కుమ్మక్కై లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని, డబ్బులకు అమ్ముడుపోయి ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు తీరని నష్టం చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్‌రావు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆరోపించారు. వారి వైఖరిని ఖండిస్తూ గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని కైలాస్‌నగర్‌లో ఆందోళనకు దిగారు. పాయల శంకర్, గండ్రత్ సుజాత, అల్లూరి సంజీవ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆ ముగ్గరికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా సంతోష్‌రావు మాట్లాడుతూ గండ్రత్ సుజాత, సంజీవ్‌రెడ్డి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీ నుండి బయటకు వెళ్లి రెబెల్‌గా బరిలోకి దిగారని గుర్తు చేశారు. మళ్లీ ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ నాయకులతో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కంది శ్రీనివాసరెడ్డి గండ్రత్ సుజాత తప్పిదాన్ని ఎత్తిచూపారు తప్పా మున్నూరు కాపులను ఎక్కడా కూడా దూషించలేదన్నారు. ఆయన అన్ని కుల సంఘాల పట్ల గౌరవంగా ప్రవర్తిస్తారని, ఈ విషయాన్ని సంఘం సోదరులు గమనించాలని విజ్ఞప్తి చేశారు. సుజాత, సంజీవ్‌రెడ్డి చేసిన ద్రోహానికి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే సరైన బుద్ధిచెబుతారంటూ హితవు పలికారు.పాయల్ శంకర్ అనవసరంగా కులమతాల మధ్య చిచ్చు పెట్టే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిని తామంతా ఖండిస్తున్నామన్నారు.ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ జహీర్ రంజాని, జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి, వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు సాయిప్రణయ్, జాఫర్ అహ్మద్, ఆవుల వెంకన్న, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెళ్లి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు గుడిపెల్లి నగేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీలేఖ, అన్నపూర్ణ, నలగంటి నవీన్, తమ్మల చందు, ఖయ్యూం, బండిదేవిదాస్‌చారి, బూర్ల శంకర్, కుర్ర నరేష్, నాగర్కర్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.